Goddess feet : పసుపులో అమ్మవారి పాదం ప్రత్యక్షం..పొటెత్తిన భక్తులు
ఆలయంలోని పసుపులో అనూహ్యంగా పాద ముద్ర కనిపించడంతో అది సాక్షాత్తు అమ్మవారి పాదమే(Goddess feet print)నని, స్వయంగా అమ్మవారు వచ్చారంటూ దర్శనం కోసం ఆలయానికి భక్తులు పోటెత్తిన ఘటన సంచలనంగా మారింది.
దిశ, వెబ్ డెస్క్ : ఆలయంలోని పసుపులో అనూహ్యంగా పాద ముద్ర కనిపించడంతో అది సాక్షాత్తు అమ్మవారి పాదమే(Goddess feet print)నని, స్వయంగా అమ్మవారు వచ్చారంటూ దర్శనం కోసం ఆలయానికి భక్తులు పోటెత్తిన ఘటన సంచలనంగా మారింది. పాతబస్తీ లాల్‌దర్వాజ మేకలబండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం(Laldarwaja Mekalabanda Sri Nallapochamma Temple)లో పసుపులో కుడికాలి పాదం గుర్తు దర్శనమిచ్చింది. అంతే సాక్షాత్తూ అమ్మవారు వచ్చారనే నమ్మకంతో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. నల్లపోచమ్మ దేవాలయం ఆవరణలో మంగళవారం రాత్రి నేల మీద పసుపు పై ఒక పాద ముద్ర ప్రత్యక్షమయ్యింది. స్వామి పూజ చేసుకుని దేవాలయంలోని సన్నిధానానికి రాత్రి 11.32గంటలకు చేరుకున్న బాలకృష్ణ అనే అయ్యప్ప భక్తుడు మొదట అక్కడ అమ్మవారి పాద ముద్ర ఉన్నట్లు గుర్తించాడు. ఒకే కాలికి సంబంధించిన పాద ముద్ర మాత్రమే స్పష్టంగా ఉండడంతో వెంటనే బాలకృష్ణ ఆలయ కమిటీ అధ్యక్షులు పొన్న వెంకటరమణ(Ponna Venkataramana) తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులకు తెలిపారు. వారంతా అమ్మవారి పాద ముద్రను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
అమ్మవారు బాలిక రూపంలో ఆలయం చుట్టూరా తిరిగి ఉండవచ్చని పాద ముద్ర పడ్డ చోట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయం కాస్త ఆనోట ఈనోటా ప్రచారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకుని సాక పెట్టడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్న వెంకట రమణ మాట్లాడుతూ మేకల బండ శ్రీ నల్ల పోచమ్మ ఆలయానికి 500 ఏళ్ల ఘన చరిత్ర కలిగి ఉందని, శ్రీ చక్రం ఆకారంలో ఆలయ గోపురం ఉంటుందన్నారు. గతంలో సుభాష్ అనే భక్తునికి అమ్మవారు కలలో ప్రత్యక్షమై బంగారు చీర చేయించాలని చెప్పిందన్నారు. అతను బోనాల సమయంలో బంగారు చీరను ప్రత్యేకంగా తయారు చేయించి, బహూకరించారన్నారు. బంగారు చీర చేయించనప్పటి నుంచి అమ్మవారు ఆలయానికి వచ్చి వెలుతున్నట్లుగా భావిస్తున్నామని తెలిపారు.