ఎంపీ ధర్మపురి అర్వింద్ పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్.. అక్కడినుంచే బరిలోకి..!
తెలంగాణ ఎంపీలు రూట్ మారుస్తున్నారు. రానున్న
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎంపీలు రూట్ మారుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. అన్ని పార్టీల్లోనూ ఇదే వ్యవహారం నడుస్తోంది. అసెంబ్లీ బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని పార్టీల ఎంపీలు సిద్దమవుతున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. అవసరమైతే కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానంటూ గతంలో అర్వింద్ వ్యాఖ్యానించడంతో ఆయన అసెంబ్లీలోకి పోటీ చేస్తారనే విషయం కన్ఫామ్ అయింది.
కానీ అర్వింద్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయంపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తన పార్లమెంట్ పరిధిలోని కోరుట్ల సెగ్మెంట్ నుంచి అర్వింద్ పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఇటీవల నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపగా.. కోరుట్లలో పసుపు రైతులు ఎక్కువమంది ఉన్నారు. అంతేకాకుండా అర్వింద్ సామాజికవర్గ ఓటర్లు కూడా ఆ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ పరిణామాలు అర్వింద్‌కు కలిసొస్తాయని, అందుకే కోరుట్లను ఎంచుకున్నట్లు చెబుతున్నారు.
అయితే ఆర్మూర్‌లో అర్వింద్ సొంత ఇంటిని నిర్మించుకోవడంతో అక్కడ నుంచి పోటీకి దిగుతారనే ప్రచారం కూడా గతంలో జరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు అర్వింద్‌ను బీజేపీ దించనుందనే ప్రచారం నడిచింది. కానీ రాజకీయ పరిణామాల క్రమంలో అర్వింద్ ప్లాన్ మార్చుకున్నారని, కోరుట్ల నుంచే పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో కూడా కోరుట్ల నుంచి అర్వింద్ పేరు ఉంది. దీంతో అక్కడినుంచి అర్వింద్ పోటీ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.