కాళేశ్వరంపై కేసీఆర్ సర్కార్ ను కడిగిపారేసిన కాగ్ రిపోర్ట్
కాళేశ్వరం ప్రాజెక్టుపై వెచ్చించే ప్రతి రూపాయికి ఆఠాణా లాభం మాత్రమే చేకూరుతోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొన్నది.
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై వెచ్చించే ప్రతి రూపాయికి ఆఠాణా లాభం మాత్రమే చేకూరుతోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొన్నది. ‘ప్రాణహిత-చేవెళ్ల’ ఎత్తిపోతల పథకం రీడిజైనింగ్ చేయడం వల్ల రూ. 767.78 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించింది. రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఇవాళ ఉభయ సభల ముందు ఉంచింది. మరోవైపు కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ ప్రయోజనాల్లో అదనపు పెరుగుదల లేదని కాగ్ స్పష్టం చేసింది. విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3,555 అదనపు వ్యయం పెరిగిందని, డీపీఆర్ ఆమోదానికి ముందే 17 రకాల పనులను అప్పగించారని, ఆ తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారని, అవసరం లేకున్నా మూడో టీఎంసీ పనులు చేపట్టారని తెలిపింది. అదనపు టీఎంసీ వల్ల రూ.25 వేల కోట్ల అదనపు వ్యయం అయిందని పేర్కొన్నది.
ఏటా రూ.10,647.26 కోట్ల వ్యయం..
రాష్ట్రం ప్రస్తుతం దాదాపు 60 శాతం విద్యుత్‌ను బాహ్య వనరుల నుంచే కొనుగోలు చేసుకుంటున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా ఇతర ఎత్తిపోతల పథకాలకు నిర్వహణ సవాలుగా మారిందని పేర్కొన్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతి ఏటా విద్యుత్ చార్జీలు, నిర్వహణ కోసం ఏటా రూ.10,647.26 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఇది ఎకరాకు రూ.46,364గా తేలుతోందని స్పష్టం చేసింది.
అధ్యయనం లేకుండానే మల్లన్న సాగర్ నిర్మాణం..
భూకంప సంబంధిత అంశాలపై లోతైన అధ్యనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని కాగ్ నివేదిక తెలిపింది. ఎన్జీఆర్ఐ చేసిన ఒక ప్రాథమిక అధ్యయనంలో ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రదేశం లోతుల్లో నిటారుగా ఉన్న పగులు ఉన్నట్లు తేలిందని అయినప్పటికీ రూ.6,126.80 కోట్ల వ్యయంతో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారని పేర్కొన్నది.