నేడు సచివాలయంలో మంత్రివర్గ భేటీ.. ఆ ఆరు అంశాలను ఫైనల్ చేసిన సర్కారు

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో పరిపాలనపై దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు నేడు సచివాలయంలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నది.

Update: 2024-05-18 03:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో పరిపాలనపై దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు నేడు సచివాలయంలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నది. దాదాపు రెండు నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధానంగా ఆరు అంశాలతో అజెండాను రూపొందించింది. మరికొన్ని అంశాలు టేబుల్ అజెండాగా చర్చకు రానున్నాయి. పంద్రాగస్టుకల్లా రైతులకు రెండు లక్షల రుణమాఫీని కంప్లీట్ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడంతో ఇప్పటికే ఒక దఫా రివ్యూ మీటింగ్ జరిగింది. దీనిపై మరింత లోతుగా చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకోడానికి, కటాఫ్ తేదీ, అర్హులను గుర్తించడం తదితర విధివిధానాలను ఖరారు చేయడానికి మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చర్చించనున్నది. ఇప్పటికే అర్హుల జాబితాను రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులను అలర్టు చేసింది.

పలు అంశాలపై రానున్న స్పష్టత

సీఎం అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో రుణమాఫీని ఏక కాలంలో అమలు చేయడానికి ఎన్ని నిధులు అవసరమవుతాయి, వాటిని ఎక్కడి నుంచి సమీకరించుకోవాలి, ఎంతమంది లబ్ధిదారులుంటారు, గైడ్‌లైన్స్ ఎలా ఉండాలి... ఇలాంటి అనేక అంశాలపై చర్చ జరగనున్నది. నిధులను సమకూర్చుకోవడానికి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడంతో ఎఫ్ఆర్‌బీఎం పరిధి, రిజర్వు బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం, వాయిదాల పద్ధతిలో కార్పొరేషన్ తిరిగి చెల్లించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో మరింత స్పష్టత రానున్నది. దీనికి తోడు ప్రస్తుత సీజన్‌కు జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు, రానున్న ఖరీఫ్ సీజన్‌కు పంటల ప్రణాళిక తదితరాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనున్నది.

రాష్ట్ర ఆదాయ వనరులను పెంపొందించుకోవడానికి ఉన్న మార్గాలపై సీఎం రెండు రోజుల క్రితమే ఎక్సయిజ్, రెవెన్యూ, మైనింగ్, రవాణా, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ, కమర్షియల్ టాక్స్ తదితర విభాగాల అధికారులతో చర్చించారు. పన్నుల లీకేజీని అరికట్టడంతో పాటు అవినీతి, అక్రమాలను నియంత్రించడంపై ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. భూముల విలువను రివ్యూ చేయడం, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా వ్యాల్యూను పెంచడం, రిజిస్ట్రేషన్ల సమయంలో స్టాంపు డ్యూటీ టారిఫ్‌ను సవరించడం.. ఇలాంటి అంశాలపైనా కసరత్తు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. వీటిపైన సైతం కేబినెట్‌లో మరింత లోతుగా చర్చించి ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశమున్నది.

బ్యారేజీలకు రిపేర్ల అంశంపైనా..

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు డ్యామేజ్ జరిగిన నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఇటీవల ఇచ్చిన ప్రాథమిక రిపోర్టులో చేసిన సిఫారసుల మేరకు రిపేర్ పనులను ప్రారంభించడంపైనా చర్చ జరగనున్నది. ఈ బ్యారేజీలను నిర్మించిన కాంట్రాక్టు సంస్థలే డిఫెక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ ప్రకారం వాటి స్వంత ఖర్చుతో చేపట్టాలా?... లేక ప్రభుత్వం తన సొంత ఆర్థిక వనరులతో చేపట్టాల్సి ఉంటుందా?.. అనే అంశాలను సైతం మంత్రివర్గ సమావేశం చర్చించనున్నది. ఎన్డీఎస్ఏ సిఫారసుల ప్రకారం ఈ పనులు చేయాలంటే ఎంత సమయం పడుతుంది?... రానున్న వర్షాకాలంలో వరదలు వస్తే మరమ్మతు పనులకు జరిగే ఆటంకం తదితరాలపై కూడా చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.

కొత్త విద్యా సంవత్సరం జూన్ నుంచి ప్రారంభమవుతున్నందున విద్యా సంస్థలు రీఓపెన్ చేయడానికి ముందే పూర్తి చేయాల్సిన సన్నాహక చర్యలపైనా కేబినెట్ చర్చించనున్నది. ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కూలు యూనిఫారంల పంపిణీ, కొత్త విద్యార్థుల అడ్మిషన్లు, పాఠశాలలకు చేయాల్సిన రిపేర్ పనులు, ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన నిధులు, ఉపాధ్యాయుల కొరత తదితరాలపైన కూడా మంత్రులు ఈ సమావేశంలో చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తికాగానే పరిపాలనపై దృష్టి పెట్టనున్నట్లు సీఎం ఇప్పటికే స్పష్టం చేయడంతో వరుసగా రెండు రోజుల నుంచి సచివాలయంలో రివ్యూ మీటింగులు జరుగుతున్నాయి. వాటికి కొనసాగింపుగా మంత్రివర్గ సమావేశానికి కూడా ముహూర్తం ఖరారైంది. ఈ సమావేశం తీసుకునే కీలక నిర్ణయాలపై ఆసక్తి నెలకొన్నది.


Similar News