దిశ, తెలంగాణ బ్యూరో: గడిచిన ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. వీటిలో 3.5 లక్షల ఎకరాల్లో వరి పంట తో పాటు ఆ తర్వాత మామిడి, మొక్కజొన్న, నువ్వులు, పెసర, జొన్న, పొద్దు తిరుగుడు, బొప్పాయి, నిమ్మ, ఇతర పండ్ల తోటలు, కూరగాయల పంటలకు భారీ నష్టం వాటిల్లింది.
అత్యధికంగా జగిత్యాల జిల్లాలో పంట నష్టాలు జరిగాయని వ్యవసాయ శాఖ తేల్చింది. ఆ తర్వాత సూర్యాపేట, కరీంనగర్, జనగామ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నది.