TGSRTC: రాఖీ ఆపరేషన్స్‌లో మెరుగైన పనితీరు కనబరిచిన వారికి రివార్డులు
రాఖీ ఆపరేషన్స్‌లో మెరుగైన పనితీరును కనబరిచిన వారికి త్వరలోనే రివార్డులను అందజేస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాఖీ ఆపరేషన్స్‌లో మెరుగైన పనితీరును కనబరిచిన వారికి త్వరలోనే రివార్డులను అందజేస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. రాఖీ ఆపరేషన్స్, మెరుగైన పనితీరుపై తమ క్షేత్రస్థాయి అధికారులతో టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేకంగా సమావేశమైంది. బుధవారం హైదరాబాద్ బస్ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. రాఖీ పండుగ సందర్భంగా సంస్థలోని ప్రతి ఒక్కరూ అద్బుతంగా పనిచేశారని కొనియాడారు. భారీ వర్షాల్లోనూ నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేశారని ప్రశంసించారు. ఈ నెల 18, 19, 20 తేదిల్లో సంస్థలో 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియో నమోదైందని వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాఖీ ఒక్క రోజే 63 లక్షల మంది తమ బస్సుల్లో రాకపోకలు సాగించారని గుర్తు చేశారు.
ఈ రాఖీ పండుగ టీజీఎస్ఆర్టీసీ రికార్డులన్నింటినీ తిరగరాసిందని తెలిపారు. అత్యధిక ఆక్యూపెన్సీ రేషియో నమోదు చేసిన డిపోల ఆర్ఎంలను ప్రత్యేకంగా అభినందించారు. ఇక రాఖీ పౌర్ణమి నాడు సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలన్న సజ్జనార్ నిర్ణయాన్ని అధికారులు అభినందించారు. దీంతో ఎలాంటి ఆలస్యం లేకుండా ఆపరేషన్స్ సజావుగా జరిగాయని, కొందరు డ్రైవర్లు బస్సు స్టీరింగ్ పై కూర్చుని భోజనం చేసి.. వృత్తి పట్ల తమ నిబద్దతను చాటుకున్నారని యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై అధికారులు, సిబ్బంది పనితనాన్ని యాజమాన్యం గుర్తిస్తుందని, రాఖీ పౌర్ణమి ఆపరేషన్స్‌లో మెరుగైన పనితీరును కనబరిచిన వారికి త్వరలోనే రివార్డులను అందజేస్తుందని తెలిపారు. టీజీఎస్ఆర్టీసీని ఆదరిస్తూ.. వెన్నుదన్నుగా నిలుస్తోన్న ప్రయాణికులందరికీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలియజేశారు.