TG Govt.: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా జరుగుతోన్న ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా కలవర పెడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా జరుగుతోన్న ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా కలవర పెడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో విద్యార్థులను సర్కార్ బడికి పంపాలంటే సంకోచిస్తున్నారు. ఈ క్రమంలోనే రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ మేరకు హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలకు పాటించేందుకు ఎన్ఐఎన్ (National Institute of Nutrition) సహాకారం తీసుకోనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (Social Welfare Residential Educational Society) ఆధ్వర్యంలో 268 విద్యా సంస్థ ఉన్నాయి. అందులో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థులు న్నారు. వారి అందరికీ ప్రతి రోజూ భోజనంతో పాటు స్నాక్స్‌ను అందించే కామన్ డైట్ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. ఈ మధ్య కాలంలో పలు చోట్ల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు.. కొన్నిచోట్ల ఆహారంలో నాణ్యత లోపించిందనే ఫిర్యాదులు తల్లిదండ్రులతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు రావడంతో సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఆహార నాణ్యతతో ప్రమాణాలతో పాటు సిబ్బంది పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్ రూపొందించేందుకు ప్రభుత్వం ఎన్ఐఎన్ సహకారం కోరింది. వీటితో పాటు సిబ్బందికి తగిన శిక్షణ మాడ్యూల్‌ను ఇచ్చి అభివృద్ధి చేయాలని ఎన్ఐఎన్‌ను ప్రభుత్వం కోరింది.