TG Assembly: సభా సమయంపై హరీష్‌రావు ఆరోపణలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణ శాసనసభా సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభా సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతుంగానే సీపీఐ నేత ఎమ్మెల్యే సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో హరీష్‌రావు, స్పీకర్‌కు మధ్య వివాదం తలెత్తింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి కలుగజేసుకుని స్పీకర్ చైర్‌కు ఎవరైన గౌరవం ఇవ్వాల్సిందేనని అన్నారు. సభా సాంప్రదాయాలు తెలిసిన, శాసనసభా వ్యవహరాల మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి హరీష్‌రావుకు ఈ విషయం తెలియకపోవడం బాధాకరమని అన్నారు.
ఆర్టీసీ అంశం ప్రాధాన్యతతో కూడకున్న అంశమని అన్నారు. కార్మికుల తమ డిమాండ్లను పరిష్కరించాలని 50 రోజుల పాటు దీక్ష చేసిన నాడు వారికి అండగా నిలబడింది సీపీఐ పార్టీ అని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ 50 వేల మది కార్మికుల పట్ల అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిన వివక్షను తట్టుకోలేక డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మ బలిదానం చేసుకున్నప్పడు కమ్యూనిస్ట్ పార్టీయే వారికి దన్నుగా నిలబడిందని తెలిపారు. అలాంటి వారికి సభలో మాట్లాడే అవకాశం కల్పించడం పట్ల హరీష్ రావు అసహనం వ్యక్తం చేయడం సమంజసం కాదని రేవంత్‌రెడ్డి అన్నారు.