హన్మకొండ అదాలత్ వద్ద ఉద్రిక్తత.. ఇరు పార్టీల నాయకుల పోటాపోటీ నినాదాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని హన్మకొండ కోర్టులో పోలీసులు ప్రవేశ పెట్టే అవకాశం ఉందన్న సమాచారంతో పార్టీ శ్రేణులు మీడియా ప్రతినిధులు కోర్టు సెంటర్ కు చేరుకొన్నారు.
దిశ, హన్మకొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని హన్మకొండ కోర్టులో పోలీసులు ప్రవేశ పెట్టే అవకాశం ఉందన్న సమాచారంతో పార్టీ శ్రేణులు మీడియా ప్రతినిధులు కోర్టు సెంటర్ కు చేరుకొన్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ ఉన్నవారిని వెళ్లి పోవలసిందిగా కోరారు. కోర్టు వెలుపల ఉన్న లాయర్లు బండి సంజయ్ ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోగా స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ రావడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొంది.
ఇదే సమయంలో ఎవరికీ వారు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు వాతావరణం వేడెక్కింది. విషయం తెలుసుకున్న పోలీసులు అదనపు పొలీసులతో చేరుకొన్నారు. కోర్టు ప్రహారిలో ఉన్న వారిని పోలీసులు బయటకు పంపించేశారు. ఇటు మీడియా ప్రతినిధులు, పోలీసులు, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులతో ప్రధాన రహదారిలో ఏం జరుగుతుందో అర్థంకాక అటుగా వెళుతున్న ప్రజలు ఆగి విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. బండి సంజయ్ ని కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉండటంతో భారీగా పోలీసులను మోహరించారు.
మధ్యాహ్నం తరువాత కోర్టులో హాజరు పరుస్తారని ప్రసార మాధ్యమంలో చక్కర్లు కొట్టడంతో హన్మకొండ, వరంగల్ నగరానికి చెందిన నాయకులు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు అరెస్టులతో పాటు ఇప్పటికే కొంత మంది నాయకులను హౌస్ అరెస్టులు చేశారు. మొత్తం మీద తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా నేటి పరిస్థితులు కనిపించడం కొసమెరుపు.