రాష్ట్రవ్యాప్తంగా 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలో రికార్డ్ స్థాయిలో భానుడి ప్రతాపం

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Update: 2024-04-04 10:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డు స్థాయిలో భానుడు ఠారెత్తిస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా నిడమనూరులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, మధ్యాహ్నం వేళ వృద్ధులు, పిల్లలు బయటకు రావద్దని సూచిస్తున్నారు.

నల్గొండ @43.5

ఇవాళ రాష్ట్రంలో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాడిపోయింది. నల్గొండ జిల్లా నిడమనూరులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అలాగే నల్గొండ జిల్లా టిక్యా తండాలో 43.4, నాంపల్లిలో 43.2, ఈఎస్ఎస్ వేములపల్లి బుగ్గబావి గూడలో 43.1, తిరుమల గిరిలో 43.1, తెల్దేవరపల్లిలో 43.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ లో 43.4, వడ్డేపల్లిలో 43, డిగ్రీలు, వనపర్తి జిల్లా పెబ్బరిలో 43.3, నిజామాబాద్ జిల్లా కోరట్పల్లిలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Tags:    

Similar News