తెలంగాణలో కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
వరుసగా ఏర్పడిన ఆల్పపీడనాల ప్రభావం పూర్తిగా తగ్గడంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
దిశ, వెబ్ డెస్క్: వరుసగా ఏర్పడిన ఆల్పపీడనాల ప్రభావం పూర్తిగా తగ్గడంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఉదయం 9 గంటలు అయినప్పటికీ ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే వణుకుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ లోని అటవీ ప్రాంతాలు ఉన్న జిల్లాల్లో కనిష్టం వాతావరణం(Minimum atmosphere) నెలకొనడంతో.. ఉష్ణోగ్రతలు(Temperatures) సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. దీంతో పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా.. ప్రజలు ముసుగేసుకొని తిరుగుతున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో 6.2 డిగ్రీలు, నిర్మల్ 8.5 డిగ్రీలు, మెదక్ 10.8 డిగ్రీలు, నిజామాబాద్ 13.8 డిగ్రీలు, హైదరాబాద్ 17.3 డిగ్రీలు, భద్రాచలం 18.5 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 6.7 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబి లో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో గరిష్ఠంగా మహబూబ్ నగర్ జిల్లాల్లో 18.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా రోజు రోజు రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా చలి తీవ్రత(Cold intensity) విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో ఉదయాన్నే లేవాలంటే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పెరుగుతున్న చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని.. ఆస్తమా, ఊపిరితిత్తుల, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు.