తెలంగాణలో TDP అధికారంలోకి రావడం చారిత్రక అవసరం: కాసాని జ్ఞానేశ్వర్
కార్యకర్తలను నేతలుగా తయారు చేసిందే తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కార్యకర్తలను నేతలుగా తయారు చేసిందే తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీడీపీలో చేరారు. వారికి కాసాని టీడీపీ కండువాను కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. టీడీపీ పాలనలోనే బడుగు, బలహీన వర్గాల వారికి స్థానిక సంస్థలలో మొదటి సారిగా రిజర్వేషన్ కల్పించడంతో ఎంతో మంది నాయకులుగా ఎదిగారన్నారు. టీడీపీలో నాయకులుగా ఎదిగి అన్ని పార్టీలలో ఉన్నారన్నారు.
ఖమ్మం సభ, టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ప్రతినిధుల సభను విజయవంతంగా చేపట్టామన్నారు. ఇంటింటికీ టీడీపీతో పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గ్రామంలోని వార్డు ప్రజలకు చేరవేస్తున్నారని, కరపత్రాలను పంపిణీ చేసి చైతన్యవంతం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం రావడం ఖాయమని, తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం అన్నారు. పార్టీలో చేరిన వారిలో వల్లభనేని జాహ్నవి, సుజాత, సురేఖ, సుమ, ఎం. లక్ష్మీ, జె. వినోద్, రామకృష్ణ, వీరాచారి తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర నాయకులు పొలంపల్లి అశోక్, కనకాల సాంబశివరావు, మెట్టుగాని శ్రీనివాస్, పాషా తదితరులున్నారు.