ఎంతో మంది త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం
ఎంతో మంది త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
దిశ ప్రతినిధి, వికారాబాద్ : ఎంతో మంది త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఆయన పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి, జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ గీతాలాపన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం మన సొంతం కావడానికి ఎంతోమంది ఈ గడ్డమీద అసమాన త్యాగాలు చేశారన్నారు. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటుంటే, హైదరాబాద్ ప్రజలు మాత్రం స్వేచ్ఛా స్వాతంత్రానికి పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. నిజాం నిర్బంధానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులై సాయుధ రైతాంగ పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ హామీల అమలుకు గ్రామాల్లో, వార్డుల్లో సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుండి 2 లక్షల 84 వేల దరఖాస్తులను స్వీకరించి వివిధ పథకాలకు అర్హులైన వారిని గుర్తించినట్టు చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే రూ. కోటి 79 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందారని, దీని వల్ల మహిళలకు 65 కోట్ల రూపాయలు ఆదా అయ్యారని తెలిపారు.
అదే విధంగా 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ను అందించే దిశగా ఇప్పటికీ లక్షా 20 వేల మంది లబ్ధిదారులను గుర్తించి కోటి 73 లక్షల రూపాయల గ్యాస్ సబ్సిడీ అందించినట్టు తెలిపారు. గృహ జ్యోతి పథకం ద్వారా ఆగస్టు వరకు లక్షా 26 వేల వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు చెప్పారు. 2 లక్షల రుణ మాఫీకి గాను లక్షా 9 వేల మంది రైతులకు 905 కోట్ల రూపాయలు అందించినట్టు తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా 3,200 మందికి చికిత్సలు చేసినట్టు వెల్లడించారు. దీనికి ప్రభుత్వం 4 కోట్ల 60 లక్షల రూపాయలను చెల్లించినట్టు పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో భాగంగా 1062 పాఠశాలలకు గాను 924 పాఠశాలల్లో పనులు ప్రారంభించి 792 పాఠశాలల్లో అన్ని రకాల పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు.
మిగతా పాఠశాలల పనులు పురోగతిలో ఉన్నాయని, వీటికి 17 కోట్ల 23 లక్షల రూపాయలను చెల్లించినట్టు తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 337 ఇళ్లు దెబ్బతినగా ఒక్కో ఇంటికి 16,500 చొప్పున మొత్తం 55 లక్షల 60 వేల రూపాయలను తక్షణ సహాయం కింద అందజేసినట్టు చెప్పారు. కలెక్టరేట్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా సంఘం లక్ష్మి భాయ్, కొత్తగడి సాంఘిక సంక్షేమ, మైనార్టీ గురుకుల పాఠశాల, బండి వెనుకచర్ల గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినీలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థినీలకు సభాపతి చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు.
అదేవిధంగా జిల్లాలోని 278 మహిళా స్త్రీనిధి కింద సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 26 కోట్ల 76 లక్షల రూపాయలను, ప్రధానమంత్రి స్వానిధి బ్యాంకు లింకేజీ కింద 15 కోట్ల రూపాయల చెక్కులను సభాపతి అందజేశారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, పరిగి, తాండూర్, చేవెళ్ల శాసన సభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.