అభయహస్తం దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్.. సర్వేలో అవి కంపల్సరీ!
రాష్ర్టంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి సారించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్టంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి సారించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే ‘మహాలక్ష్మీ’ స్కీమ్ ఇప్పటికే అమలు చేస్తోంది. పేద ప్రజల వైద్య చికిత్సలకు సహాయం అందించే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను త్వరలోనే అమల్లోకి తేబోతున్నారు. అయితే ఈ పథకాల కోసం డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి మొదటివారం వరకు అభయహస్తం దరఖాస్తులు స్వీకరించగా కోటి మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందు కోసం డోర్ టు డోర్ సర్వే చేయాలని నిర్ణయించారు. సిబ్బంది దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి వివరాలను సరిచూస్తారు. దరఖాస్తులో పేర్కొన్న విధంగా వివరాలు ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. దరఖాస్తుతో జతచేసిన పత్రాలను నిర్ధారణ చేసుకుంటారు.
ఐడీలు కంపల్సరీ
ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం ఇంటికి వచ్చే సిబ్బంది లబ్ధిదారుల ఐడీలు, ప్రూఫ్‌లు అడగనున్నారు. ఆధార్, అడ్రస్, బర్త్ సర్టిఫికెట్లతోపాటు ఇతర ధ్రువీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అన్ని రకాల వెరిఫికేషన్ తరువాత లబ్ధిదారులను గుర్తించనున్నారు. ఇంటింటి వెరిఫికేషన్ తేదీని త్వరలోనే నిర్ణయించనున్నారు.