80 మంది అభ్యర్థులు ఖరారు.. ఈ నెలలోనే టీ కాంగ్రెస్ తొలి జాబితా
ఎన్నికలు సమీపిస్తుండటం, వచ్చే నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తుండటం, వచ్చే నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ షురూ చేసింది. గురువారం, శుక్రవారం రెండు రోజులపాటు ఢిల్లీలో అభ్యర్థుల ఖరారుపై స్క్రీనింగ్ కమిటీ వరుస సమావేశాలు నిర్వహించింది. నిన్నటితో ఈ భేటీలు ముగియగా.. అభ్యర్థుల ఖరారుపై సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని నియోజకవర్గాల టికెట్లపై నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోగా.. మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
దాదాపు 80కిపైగా స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయినట్లు సమాచారం. వివిధ సర్వే రిపోర్టులు, నియోజకవర్గాల్లోని సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను కన్ఫామ్ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఒకరు లేదా ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నచోట అభ్యర్థులను ముందుగా ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ఎక్కువమంది పోటీలో ఉన్న నియోజకవర్గాలపై స్క్రీనింగ్ కమిటీ చర్చించింది. ఈ చర్చలో తెలంగాణలో కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా పాల్గొన్నారు.
గురువారం 7 గంటలు, శుక్రవారం 5 గంటల పాటు సమావేశం జరిగింది. 80 మంది అభ్యర్థులను చివరికి ఖరారు చేశారు. ఈ తొలి జాబితాను ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ మొదటివారంలో ప్రకటించనున్నారని తెలుస్తోంది. ముందుగా పార్టీ ఎన్నిలక కమిటీకి జాబితాను సీల్డ్ కవర్‌లో పంపనున్నారు. ఎన్నికల కమిటీ ఆమోదం ద్వాారా అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయనున్నారు. ఇక జూబ్లీహిల్స్, ఎల్బీనగర్‌తో పాటు గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని చాలా నియోజకవర్గాలకు ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వడపోత చేపట్టి అభ్యర్థులను ఖరారు చేయడం స్క్రీనింగ్ కమిటీకి సవాల్‌గా మారనుంది. దాదాపు 20 సీట్లలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై స్క్రీనింగ్ కమిటీ ఒక నిర్ణయానికి రాలేకపోతుంది. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో త్వరలో మరోసారి భేటీ కానున్నారు.