Amit Shah: స్థానిక ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. రాష్ట్ర నేతలకు అమిత్ షా కీలక దిశానిర్దేశం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు తెలంగాణ బీజేపీ పావులు కదుపుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : తెలంగాణలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉత్సాహంగా పనిచేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) కష్టపడి పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) టీబీజేపీ (Telangana BJP) నేతలకు సూచించారు. ఇవాళ పార్లమెంట్ భవనంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి (Kishan Reddy) నేతృత్వంలో తెలంగాణ ఎంపీలు, కొత్తగా ఎంపికైన ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నాయకులు అమిత్ షాను కలిశారు. ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మల్క కొమురయ్య, అంజిరెడ్డిని అమిత్ షా అభినందించారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), ఎంపీలు డీకే అరుణ, రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డా.కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అయితే పార్టీలో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయంతో కాషాయపార్టీలో జోష్ కనిపిస్తోంది. ఈ జోష్‌ను కంటిన్యూ చేసేలా కొత్త అధ్యక్షుడి పేరును పార్టీ పెద్దలు అనౌన్స్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. అయితే వచ్చే నెల 18-20 తేదీలలో బెంగళూరులో బీజేపీ కౌన్సిల్ మీటింగ్ జరగబోతున్నది. ఈ సమావేశం తరువాతే కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.