తెలంగాణ BJP నేతలకు అమిత్ షా కార్యాలయం నుంచి ఫోన్!
బీజేపీ రాష్ట్ర నేతలకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. తెలంగాణకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా హస్తినకు రావల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి పలువురికి కాల్స్ వెళ్లాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర నేతలకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. తెలంగాణకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా హస్తినకు రావల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి పలువురికి కాల్స్ వెళ్లాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు షాతో మీటింగ్ ఉంటుందని షా కార్యాలయ వర్గం వారికి సూచించింది. ఇదిలా ఉండగా పలువురు నేతలు సోమవారం హస్తినకు పయనమయ్యారు. మరికొందరు మంగళవారం ఉదయం వెళ్తున్నారు. అమిత్ షా పిలుపు నేపథ్యంలో ఏయే అంశాలపై ప్రస్తవించనున్నారనేది సస్పెన్స్‌గా మారింది. ఎలాంటి ఇష్యూస్‌పై చర్చ ఉంటుందనేది అంతు చిక్కడం లేదు. రాజకీయ వర్గాల్లో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ.. కేసీఆర్ స్పీడ్‌కు బ్రేకులు వేయాలని చూస్తోంది. దీనికోసం గ్రౌండ్ లెవల్ నుంచి బలోపేతం కావడంపై పార్టీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 11 వేల వీధి సభలను నిర్వహించాలని డిసైడ్ అయింది. ఇప్పటికే 9వేల వరకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పూర్తయ్యాయి. దీనిపై జాతీయ నాయకత్వం సైతం సంతృప్తిని వ్యక్తంచేసింది. ఇదిలా ఉండగా బన్సల్ వీధి సభలపై ఎప్పటికప్పుడు నివేదికలను జాతీయ నాయకత్వానికి పంపించి మీటింగ్స్ ఆలస్యం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఒకవైపు వీధి సభలు జరుగుతుండగానే బన్సల్ సీక్రెట్ ఆపరేషన్‌ను మొదలుపెట్టారు. స్తబ్దుగా ఉన్న నేతలకు సంబంధించిన వివరాలను తీసుకుని వారితో టచ్‌లోకి వెళ్లారు. ఈ నివేదిక సైతం జాతీయ పార్టీకి అందించినట్లు సమాచారం. మరోవైపు లిక్కర్ కేసులోనూ అనూహ్య మలుపులు తీసుకుంటున్న తరుణంలో తెలంగాణ జాతీయ కార్యవర్గ సభ్యులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ కీలకంగా మారనుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై షా నేతలతో చర్చించనున్నారా? లేక మరే ఇతర వ్యూహాలను వారికి వివరించనున్నారా? అనేది సస్పెన్స్‌గా మారింది. రేపటి భేటీ తర్వాత దీనిపై ఒక క్లారిటీ రానుంది.