రేపు రాష్ట్రానికి బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)లో పలు పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Update: 2023-03-16 08:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)లో పలు పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి, బోర్డు ధ్వంసం చేసిన నేపథ్యంలో బీజేవైఎం నేతలపై కేసులు నమోదయ్యాయి. వారికి కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్‌కు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య రానున్నారు.

ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న బీజేవైఎం నేతలను ములాఖాత్‌లో తేజస్వీ సూర్య కలవనున్నారు. రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు భాను ప్రకాష్‌తో పాటు మరో 8మంది బీజేవైఎం కార్యకర్తలను ఆయన పరామర్శించనున్నారు. అయితే, మంగళవారం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు.

కొందరు బీజేవైఎం నాయకులు ప్రధాన గేటు ఎక్కి తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ బోర్డును తొలగించారు. ఆపై, కార్యాలయం ఆవరణలో బైఠాయించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముట్టడికి యత్నించిన బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్, శివశంకర్‌, పవన్‌రెడ్డి, జమాల్‌పూర్‌ ఆయుష్‌, ఏ రాజునేత, మన్మధరావు, పూజారి రాము యాదవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

వారిపై ఐపీసీ సెక్షన్ 3&4,143, 427 ,448 ,353 తో పాటు 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అరెస్టు అనంతరం బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. ఈ కేసులో 9 మంది బీజేవైఎం నేతలను అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం వీరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించగా, చంచల్ గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News