Teacher Kidnapped: స్కూల్ కు వెళ్తున్న టీచర్ ను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి.. వీడియో వైరల్

స్కూల్ కు వెళ్తున్న టీచర్ ను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేశారు.

Update: 2024-12-14 12:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: స్కూల్ కు వెళ్తున్న ఉపాధ్యాయుడిని (Teacher Kidnapped) కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసిన ఘటన బిహార్ (Bihar) లోని కితహార్ జిల్లాలో వైరల్ గా మారింది. తుపాకులతో బెదిరించి గుడి వద్దకు తీసుకువెళ్లి అప్పటికే పెళ్లికూతురుగా ముస్తాబులో ఉన్న ఓ మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది. బేగుర్ సరాయ్ జిల్లాలో నిరాజౌరాకి చెందిన అవ్నీష్ కుమార్ ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి కతిహార్ జిల్లా మిడిల్ స్కూల్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. నిన్న (శుక్రవారం) అతడు స్కూల్ కు వెళ్తుండగా కొంత మంది రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చి అతడిని అడ్డుకున్నారు. గన్స్ తో బెదిరించి కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి అతడిని ఓ ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ గుంజన్ అనే మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు.

కాగా, లఖిసరాయ్ జిల్లాకు చెందిన గుంజన్ అనే మహిళతో అవ్నీష్ కుమార్ నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఉద్యోగం రాగానే అతడు పెళ్లికి నిరాకరించాడని దాంతో బలవంతంగా కిడ్నాప్ చేసి పెళ్లి  (forced marriage) చేయాల్సి వచ్చిందని అమ్మాయి తరపు వారు వాదిస్తున్నారు. అయితే పెళ్లి తంతు ముగిసిన తర్వాత తన భార్యతో కలిసి అవ్నీష్ కుమార్ తన ఇంటికి వెళ్లగా గుంజన్ ను కోడలిగా స్వీకరించేందుకు అతడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో తనకు న్యాయం చేయాలని సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. మరో వైపు గుంజన్ తో తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని తుపాకులతో బెదిరించి కిడ్నాప్ (Kidnap) చేసి  ఆమెతో బలవంతంగా వివాహం చేశారని అవ్నీష్ కుమార్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరు పక్షాలు పరస్పరం కేసులు పెట్టుకోవడంతో ఈ బలవంతపు పెళ్లి పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. మరో వైపు 'పకడ్వా వివాహం' పేరుతో బాగా పాపులర్ అవుతున్న ఈ బలవంతపు పెళ్లిల్లు గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ జరిగినట్లు బిహార్ పోలీసులు (Bihar Police) తెలిపారు. 

Tags:    

Similar News