రేవంత్ రెడ్డే తెలంగాణ CM కావాలి: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ నెక్ట్స్ సీఎం ఎవరు అనేదానిపై రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో మంతనాలు జరుపుతోంది. ఇవాళ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నెక్ట్స్ సీఎం ఎవరు అనేదానిపై రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో మంతనాలు జరుపుతోంది. ఇవాళ సాయంత్రం సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటిస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ సీఎం పోస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా సస్పెన్ నెలకొన్న వేళ.. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటేనే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తోందని.. చంద్రబాబు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉంటే రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడం సంతోషంగా ఉందన్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీ పోటీ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు టీడీపీ నుండి పోటీ నుండి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు వినిపించాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు హస్తంతో చేయి కలిపి మద్దతు ఇచ్చారు.