మరోసారి తెలంగాణకు తమిళి సై.. ఎన్నికల వేళ హాట్ టాపిక్‌గా మాజీ గవర్నర్ రీ ఎంట్రీ..!
తెలంగాణలో డబుల్ డిపాజిట్ సీట్లే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే అగ్రనేతలను బీజేపీ రంగంలోకి దింపి
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో డబుల్ డిపాజిట్ సీట్లే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే అగ్రనేతలను బీజేపీ రంగంలోకి దింపి ప్రచారం హోరెత్తిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు ఓ దఫా ప్రచారం కంప్లీట్ చేయగా.. రెండో టర్మ్ ప్రచారానికి సైతం షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. వీరితో పాటుగా తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళి సైతం తెలంగాణలో ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు తమిళి సై ప్రచార షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది.
తమిళి సై ప్రచారానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా లోక్ సభ ఎన్నికల ప్రచారం చేయడానికి మాజీ గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్ తెలంగాణకు రానున్నారని ప్రకటనలో తెలిపారు. తమిళనాడు బీజేపీ వాలంటీర్లతో కలిసి ఈ నెల 29వ తేదీన ఆమె రాష్ట్రానికి వస్తున్నట్లు పేర్కొన్నారు. 10 రోజులకు పైగా తెలంగాణలో ఉంటూ తెలంగాణలోని వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వెల్లడించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ తెలంగాణ, తమిళ ప్రజలతో మమేకమవుతూ తమిళనాడు బీజేపీ వాలంటీర్లుతో కలిసి ప్రచారం చేయనున్నారని పేర్కొన్నారు.
కాగా, ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళి సై.. లోక్ సభ ఎన్నికల వేళ మళ్లీ పాలిటిక్స్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళనాడులోని చెన్నై సౌత్ పార్లమెంట్ నుండి బీజేపీ అభ్యర్థినిగా ఆమె పోటీ చేశారు. తమిళనాడులో ఎన్నికలు ముగియడంతో.. తెలంగాణలో గవర్నర్‌గా పని చేసిన అనుభవంతో పాటు ఇక్కడ ఉన్న పరిచయాల నేపథ్యంలో బీజేపీ హై కమాండ్ ఆమెను తెలంగాణ బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రచారం చేయడానికి తమిళి సై రానున్నారు. గతంలో రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన తమిళి సై.. ఇప్పుడు బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా వస్తుండటంతో ఆమె ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది. ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తమిళి సై ఎలా విరుచుకుపడుతారోనని పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.