ముగిసిన బీఆర్ఎస్ బీసీ నేతల ‘తమిళనాడు’ పర్యటన

తమిళనాడులో బీసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు, రిజర్వేషన్లపై అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ బీసీ నేతల బృందం రెండ్రోజుల పర్యటన ముగిసింది.

Update: 2024-09-27 17:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తమిళనాడులో బీసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు, రిజర్వేషన్లపై అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ బీసీ నేతల బృందం రెండ్రోజుల పర్యటన ముగిసింది. రెండోరోజూ శుక్రవారం ద్రవిడ కజకం(డీకే) పార్టీ కార్యక్రమాలన్ని సందర్శించారు. ఆపార్టీ అధ్యక్షుడు వీరమనితో భేటీ అయ్యారు. ద్రావిడ ఉద్యమం ఆవిర్భావం, దాని పూర్వాపరాలు, తదనంతర పరిణామాలు, వెనుకబడిన కులాల సమున్నతికి దోహదపడిన అంశాల గురించి తెలుసుకున్నారు. అనంతరం ద్రావిడ ఉద్యమానికి మూల పురుషుడు పెరియార్ రామస్వామి నాయకర్ ఫొటోలు, ఆయన ఉపయోగించిన వస్తువుల ప్రదర్శనను తిలకించారు. అదే విధంగా తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రాంమోహన్, బీసీ సంఘాలకు చెందిన పలువురు నాయకులతో సమావేశమై పలు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా రాంమ్మోహన్ మాట్లాడుతూ మద్రాస్ ప్రెసిడెన్సీలో మొదలైన బీసీల హక్కుల పోరాటం సుదీర్ఘకాలం అనేక రూపాల్లో కొనసాగిందని, ప్రజల డిమాండ్ల పట్ల తమిళనాడు రాష్ట్రప్రభుత్వాలు సామాజిక దృక్ఫథంతో వ్యవహరించాయని వివరించారు. తమిళనాడు రాష్ట్ర విద్యా,ఉద్యోగాల్లో 69% శాతం రిజర్వేషన్ల అమలు వెనుక సుధీర్ఘ చరిత్ర ఇమిడి ఉందని వివరించారు.తమిళనాడు ప్రజల చైతన్యం, రాజకీయ పార్టీల విధానం, తమిళ ఉద్యమాలు, సాధించిన విజయాలు ఇతర రాష్ట్రాల్లో న్యాయం కోసం ఎదురు చూస్తున్న వర్గాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. డీఎంకే మాజీ ఎమ్మెల్యే శేఖర్ తో భేటీ అయ్యి ఆపార్టీ బలోపేతం, బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆధ్వర్యంలో నాయకులు రవిచంద్ర, బండప్రకాష్, స్వామి గౌడ్, కాలేరు వెంకటేశ్వర్లు, బిక్షమయ్య గౌడ్, బాలరాజు యాదవ్, కిశోర్ గౌడ్, చెరుకు సుధాకర్, దాసోజు శ్రీనివాస్, రాజ్యలక్ష్మి, ఉమ, తదితరులు బృందంలో ఉన్నారు.


Similar News