సీఎం కేసీఆర్ కూడా ఆ సినిమా చూడాలి: బండి సంజయ్ కీలక సూచన
‘ది కేరళ స్టోరీస్’ సినిమాలో చూపించిన నిజాలు.. కేవలం కేరళకు మాత్రమే పరిమితం కాదని, లవ్ జిహాద్ పేరుతో తెలంగాణలో కూడా దారుణాలకు పాల్పడుతున్నారని
దిశ, తెలంగాణ బ్యూరో: ‘ది కేరళ స్టోరీస్’ సినిమాలో చూపించిన నిజాలు.. కేవలం కేరళకు మాత్రమే పరిమితం కాదని, లవ్ జిహాద్ పేరుతో తెలంగాణలో కూడా దారుణాలకు పాల్పడుతున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఓల్డ్ సిటీలో సౌదీ నుంచి వచ్చి పెళ్లి చేసుకొని వెళ్తున్నారని, ముస్లిం మహిళలకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని గుర్తుచేశారు. సోమవారం కాచిగూడ తారకరామ థియేటర్‌లో కేరళ స్టోరీస్ సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కేరళ సినిమా చూడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పేరు ప్రఖ్యాతలు, వ్యాపారం కోసం సినిమా తీయలేదని, ఈ సినిమా సమాజానికి కొన్ని జాగ్రత్తలు చెప్పిందని అన్నారు.
కేరళతో పాటు దేశవ్యాప్తంగా ఐఎస్ఐ లాంటి ఉగ్రవాద సంస్థలు అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి లోబరుచుకుంటాయని తెలిపారు. ఇదే విధంగా తెలంగాణలో లవ్ జిహాద్ పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఏ ధర్మ రక్షకుడికి అమ్మాయి పరువు తీయాలని ఉండదన్నారు. ఈ సినిమాలో నిజం చూపించింది 5 నుంచి 10 శాతమే అని అన్నారు. అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని అస్థిర పర్చాలని చూస్తున్నారని, తమ పిల్లలకు సినిమా చూపించాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘ది కేరళ స్టోరీస్’ లాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఉగ్రవాద సంస్థల ప్రతినిధులకు స్థావరాలు ఇస్తున్నారని ఆరోపించారు.
క్రిస్టియన్ అమ్మాయిలను కూడా మోసం చేస్తున్నారని, సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ కూడా కేరళ సినిమా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విధించే ఈ సినిమాకు పన్నులు మినహాయించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే కేరళ స్టోరీస్ లాంటి సినిమాలు వారానికి ఒకటి తీస్తామన్నారు. ఈ సినిమా డైరెక్టర్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు. కరీంనగర్‌లో జరిగే హిందూ ఏక్తా యాత్రకు కేరళ స్టోరీస్ సినిమా డైరెక్టర్ రాబోతున్నారని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేరళ సినిమా రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలన్నారు. సినిమాలో యదార్థ గాథను చూపించారన్నారు. ఉగ్రవాద సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణలో రజాకార్ ఫైల్స్ సినిమా రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.