Suravaram Sudhakar Reddy: సాయుధ పోరాటంలో చండ్ర రాజేశ్వరరావుది కీలక పాత్ర..

భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత చండ్ర రాజేశ్వరరావు కమ్యూనిస్టు ఉద్యమానికి తన వ్యక్తిగత ఆస్తులను త్యాగం చేశారని సీఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.

Update: 2023-06-06 14:11 GMT
Suravaram Sudhakar Reddy: సాయుధ పోరాటంలో చండ్ర రాజేశ్వరరావుది కీలక పాత్ర..
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత చండ్ర రాజేశ్వరరావు కమ్యూనిస్టు ఉద్యమానికి తన వ్యక్తిగత ఆస్తులను త్యాగం చేశారని సీఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 109 వ జయంతి సందర్భంగా కొండాపూర్ లోని సీఆర్ ఫౌండేషన్‌లో చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి సి ఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు సురవరం సుధాకర్ రెడ్డి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో సురవరం ప్రసంగిస్తూ తెలంగాణ సాయుధ పోరాట తొలినాళ్లలో హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో తన పేరు మార్చుకొని ప్రవేశించి రావి నారాయణరెడ్డి, గురువారెడ్డి, మొహియుద్దీన్ తదితర ప్రముఖులతో కలిసి కమ్యూనిస్టు పార్టీని నిర్మించి, తెలంగాణ సాయుధ పోరాట ఉధృతికి, విజయానికి నాయకత్వం వహించారని గుర్తుచేశారు. సీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు కే నారాయణ మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు భౌతికంగా మన వద్ద లేకపోయినా ఆయన ఆశయాల రూపంలో మనందరిలో ఉన్నారని, ఆయన ఆశయాలను సాధించడం కోసం కృషి చేస్తామన్నారు. సీఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి ప్రసంగిస్తూ చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తితోనే ఆయన పేరు మీద సీఆర్ ఫౌండేషన్ స్థాపించారని తెలిపారు.

సీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాన్ని, నీలం రాజశేఖర్ రెడ్డి రీసెర్చ్ సెంటర్, లైబ్రరీ, మహిళా సంక్షేమ కేంద్రం, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వరరావు, కోశాధికారి చెన్నకేశవరావు, హెల్త్ డైరెక్టర్ కే రజిని, మహిళా సంక్షేమ కేంద్రం డైరక్‌టర్‌ డి. క్రిష్ణకుమారి, ఏఐటీయూసీ మాజీ కార్యదర్శి బివి విజయలక్ష్మి, వృద్ధాశ్రమ వాసులు తదితరులు పూల మాలలతో నివాళులర్పించారు.


Tags:    

Similar News