ప్రగల్బాలు పలకడం ఆపి, భద్రత కల్పించండి.. అత్యాచార ఘటనపై హరీష్ రావు ఫైర్

ఎంఎంటీఎస్ రైలులో జరిగిన ఘటన పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని, ప్రగల్బాలు పలకడం ఆపి, మహిళల ప్రాణాలకు భద్రత కల్పించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

Update: 2025-03-24 10:03 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎంఎంటీఎస్ రైలులో జరిగిన ఘటన పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) సిగ్గుతో తలదించుకోవాలని, ప్రగల్బాలు పలకడం ఆపి, మహిళల ప్రాణాలకు భద్రత కల్పించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (BRS MLA Harish Rao) అన్నారు. నిన్న రాత్రి ఓ మహిళ ఎంఎంటీఎస్ రైలులో (MMTS Train Incident) ప్రయాణిస్తున్న సమయంలో ఓ నిందితుడు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. నిందితుడి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు నుంచి దూకేసింది. దీంతో తీవ్ర గాయాల పాలైన మహిళను గాంధీ ఆసుపత్రిలో చేర్పించి, వైద్యం అందిస్తున్నారు.

దీనిపై ట్విట్టర్ లో స్పందించిన హరీష్ రావు.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఘటనపై ఆయన.. నిన్న సాయంత్రం ఎంఎంటీఎస్ రైలులో ఉద్యోగిని పై జరిగిన అత్యాచారయత్నం ఘటన యావత్ తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందని, రాష్ట్ర రాజధానిలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నట్లు? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే ఆ కీచకుడి నుండి తనను తాను కాపాడుకోవడం కోసం రైలు నుంచి దూకి తీవ్రంగా గాయపడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ ఆడబిడ్డ దీన స్థితికి ఎవరు బాధ్యులు? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని, గతేడాదితో పోలిస్తే, ఈ ఏడాదిలో అత్యాచారం కేసులు 29% పెరుగుదలతో 2945 కేసులు నమోదైనట్లు సాక్షాత్తు డీజీపీ (DGP) ప్రకటించారని తెలిపారు.

అంటే సగటున ప్రతి నెలా 250 అత్యాచార కేసులు నమోదవుతున్న దారుణమైన పరిస్థితి ఏర్పడిందని, ప్రతీ రోజూ రాష్ట్రంలో మహిళలలు అత్యాచారాలు, హత్య, వేధింపులకు గురవుతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకు చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మహిళలకు భద్రత కల్పించడంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని, హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రంలో శాంతి భద్రతలు పడిపోవడానికి మీ చేతగాని పాలనే కారణమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని ప్రగల్బాలు పలకడం కాదు, ముందు మహిళల ప్రాణాలకు భద్రత కల్పించండి అని బీఆర్ఎస్ నేత కోరారు. 

Tags:    

Similar News