టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీక్ పై హైకోర్టుకు సిట్ నివేదిక

టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ మంగళవారం హై కోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదిక అందించింది.

Update: 2023-04-11 07:46 GMT

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ మంగళవారం హై కోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదిక అందించింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిల పాత్ర పై సిట్ అధికారులు నివేదికలో ఫోకస్ చేసినట్లు తెలిసింది. బోర్డు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం నిందితులకు అవకాశం కల్పించిందని పేర్కొన్నట్టు సమాచారం. సిట్ అధికారులు నివేదికలో ఈ అంశాలను వివరించినట్లు తెలిసింది. మూడేళ్లుగా బోర్డు కార్యాలయంలో సెక్రటరీ అనితా రామచంద్రన్ వద్ద పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్ లీకేజీలో ప్రధాన సూత్రధారి.

కాన్ఫిడెన్షియల్ రూం ఇంచార్జ్ శంకర్ లక్ష్మి డైరీ నుంచి ఆమెకు తెలియకుండా కంప్యూటర్ల పాస్ వర్డులు, ఐపీ అడ్రసులు తీసుకున్న ప్రవీణ్ వాటిని రాజశేఖర్ రెడ్డికి ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ పై నెట్వర్క్ ఇంచార్జ్ గా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి వాటి సహాయంతో ప్రశ్నపత్రాలు తస్కరించి పెన్ డ్రైవ్‌ల్లోకి డౌన్ లోడ్ చేసాడు. ఇలా చోరీ చేసిన ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్ పది లక్షల రూపాయలకు గురుకుల టీచర్ రేణుకకు ఇచ్చాడు.

ఆమె తన భర్త డాక్య నాయక్‌కు ఇవ్వగా అతను 13.50 లక్షలకు గోపాల్ నాయక్, నీలేష్ నాయక్‌లకు అమ్మాడు. ఇక షాద్ నగర్‌కు చెందిన ప్రశాంత్ తనకు తెలిసిన తిరుపతయ్య నుంచి 10 లక్షలకు బేరం కుదుర్చుకుని, 5 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చి ఇదే ప్రశ్నపత్రం తీసుకున్నాడు. డాక్య నాయక్ నుంచి తిరుపతయ్య ఈ పేపర్ తీసుకుని ప్రశాంత్‌కు ఇచ్చాడు. డాక్య నాయక్ బావమరిది రాజేశ్వర్ నాయక్ ఇదే పరీక్ష ప్రశ్నపత్రాన్ని మహబూబ్ నగర్ నవాబ్ పేటకు చెందిన రాజేందర్ కు అమ్మాడు.

ఇక కొట్టేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంతో బోర్డు ఉద్యోగులు ప్రవీణ్, షమీమ్, రమేష్, సురేష్ పరీక్ష రాశారు. న్యూజీలాండ్‌లో ఉంటున్న రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ రెడ్డి ఈ పరీక్ష రాసినట్టుగా తెలిసినా నిర్ధారణ కాలేదు. రెండు సార్లు నోటీసులు ఇచ్చిన అతను విచారణకు రాలేదు. ఇక లౌకిక్ అనే వ్యక్తి తన భార్య సుస్మిత కోసం ప్రవీణ్ నుంచి డీఏఓ ప్రశ్నపత్రాన్ని కొన్నాడు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి కలిసి ఆరు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను సెట్లకు సెట్లుగా కొట్టేసారు. ఈ కేసులో 150 మందికి పైగా విచారణ చేసాం. బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రాంచంద్రన్ స్టేట్మెంట్లు రికార్డు చేసాం.

Tags:    

Similar News