దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కొన్ని కేసులు రాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తున్నాయి. కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేస్తుండగా, కేంద్ర సంస్థలు సైతం దర్యాప్తునకు వస్తుండడంతో సమస్య ఉత్పన్నమవుతుంది. అప్పటి వరకు చేసిన ఇన్వేస్టిగేషన్ వివరాలను ఇవ్వడానికి సిట్ అధికారులు నిరాకరిస్తున్నారు. గతంలో మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులోనూ సీబీఐ చేతికి వివరాలు అందలేదు. తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో వివరాలు ఇవ్వడానికి సిట్ నిరాకరించడంతో ఈడీ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
‘టీఎస్పీఎస్సీ’ కేసులో నాంపల్లి కోర్టుకు ఈడీ
టీఎస్పీఎస్సీ పేపర్స్ లీక్ కేసులో సిట్ సహకరించడం లేదని ఈడీ గురువారం నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్, బీజేపీలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో ఈడీ రంగంలోకి దిగింది. బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ తోపాటు సిట్ విచారణలో వెల్లడైన వివరాలు, అరెస్టు చేసిన నిందితులకు సంబంధించిన వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు ఇవ్వాలంటూ సిట్ కు లేఖ రాసింది.
రోజులు గడుస్తున్నా సిట్ నుంచి స్పందన రాకపోవడంతో ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు సహకరించేలా సిట్ కు ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. దీనిపై సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణ దాదాపుగా ముగింపు దశకు వచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులోని వివరాలను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించినట్టు పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసు వివరాలను ఈడీకి అందించాల్సిన అవసరం లేదన్నారు.
మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులోనూ..
గతంలో మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులోనూ ఇలాగే జరిగింది. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని, కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నాయకులు హై కోర్టును ఆశ్రయించారు. దీంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు, కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, ఎంక్వయిరీ వివరాలను అందజేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు సిట్ అధికారులకు లేఖలు రాశారు. అయితే దీనిపై అధికారులు స్పందించలేదు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు.
డివిజన్ బెంచ్ కూడా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఆ తర్వాత వివరాల కోసం సీబీఐ మళ్లీ అధికారులకు లేఖ రాసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం, సిట్ స్పందించలేదు. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. హై కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు సైతం నిరాకరించింది. కేసును జూలైకి వాయిదా వేసింది. అప్పటి వరకు సీబీఐ విచారణపై స్టేటస్ కో విధిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇప్పటి వరకు సీబీఐకి మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసు వివరాలు ఇప్పటి వరకు అందలేదు.