'ఇతర పార్టీల్లో హిందువులు లేరా?'.. సింకారు శివాజీ సంచలన కామెంట్స్
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని దీనిని కేవలం వ్యతిరేకించడం కాకుండా పూర్తిగా నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దేశంలోని పలువురు నేతలు, ప్రముఖులు ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హిందూ సంఘాలు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెలబ్రిటీ కావడం కోసం హిందు ధర్మం పైన ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడిన ఒళ్లు పగుల్తదని హెచ్చరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ ఇతర పార్టీలలో హిందువులు లేరా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజంగా కేసీఆర్ భయంకరమైన హిందూ ఐతే హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, బేగంబజార్ పేర్లను మార్చి.. భాగ్యనగర్, ఇందూర్, కరినగర్, పాలమూరు, లక్ష్మీ మాత బజార్‌గా మార్చి నేనే భయంకరమైన హిందూ అని నిరూపించుకోవాలని కేసీఆర్‌కి సవాల్ చేశారు.