కేసీఆర్ కు దెబ్బమీద దెబ్బ.. ఎంపీ ఎలక్షన్ ముగియగానే ఊహించని షాకిచ్చిన ఈడీ

బీఆర్ఎస్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

Update: 2024-06-20 07:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైల్లో ఉండగా, పార్టీకి చెందిన పలువురు నేతలపై ఐటీ, ఈడీ సంస్థల దాడులు జరిగాయి. మరోవైపు పార్టీ ఫిరాయింపులు, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో సతమతం అవుతున్న గులాబీ పార్టీలో తాజాగా గూడెం మహిపాల్‌రెడ్డిపై ఈడీ ఫోకస్ పెట్టడం హాట్‌టాపిక్‌గా మారింది. ఎంపీ ఎన్నికలు ముగియగానే ఈడీ రంగంలోకి దిగడం చర్చకు దారితీస్తోంది.

నిన్న కారు కొనుగోలు... నేడు ఈడీ సోదాలు..

ఇవాళ తెల్లవారుజామున పటాన్‌చెరు చేరుకున్న 40 మంది అధికారుల బృందం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి అల్లుడి చంద్రశేఖర్‌, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. ఇటీవలే లక్డారం గనుల వ్యవహారంలో పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా గూడెం మధు అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే లక్డారంలోని ఎమ్మెల్యే ఫ్యామిలీ అక్రమ మైనింగ్‌పై స్థానికులతోపాటు పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత నందీశ్వర్‌గౌడ్ స్వయంగా ప్రధానికి గతంలో ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌లో భారీగా అవకతవకలకు తెరలేపడంతో పాటు పెద్దఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నిన్ననే మహిపాల్‌రెడ్డి రూ.3 కోట్ల ఖరీదైన ల్యాండ్ క్రూయిజర్ కారును కొనుగోలు చేశారనే ప్రచారం జరుగుతోంది. తనిఖీలు చేపట్టిన ఈడీ అధికారులు ఖరీదైన కారును గుర్తించడంతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

స్టేట్ పాలిటిక్స్‌లో బిగ్‌ట్విస్ట్ తప్పదా?

ఈడీ సోదాల వ్యవహారం రాజకీయంగా కీలక పరిణామాలకు దారితీయవచ్చనే చర్చ జరుగుతోంది. ఇటీవల మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన నలుగురు ఎమ్మెల్యేలో మహిపాల్‌రెడ్డి ఒకరు. ఇటీవల మంత్రి దామోదర రాజనర్సింహతోనూ భేటీ అయ్యారు. దీంతో మహిపాల్‌రెడ్డి పార్టీ మారడం దాదాపు ఖాయమనే డిస్కషన్ సాగింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిపోవడంతో మహిపాల్ రెడ్డితోపాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి ఈడీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయోననే ఉత్కంఠ నెలకొన్నది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..