తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు
తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని మంగళవారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు పేర్కొన్నందుకు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. 2018లో జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వనమా వెంకటేశ్వర రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అప్పట్లో బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన జలగం వెంకట్రావుపై 4,139 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కాగా, వనమా వెంకటేశ్వర రావు ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను తప్పుగా ఇచ్చినట్టు జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. వనమా వెంకటేశ్వర రావు ఎన్నికను రద్దు చెయ్యాలని అందులో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు సుధీర్ఘ విచారణ జరిపి ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా మంగళవారం తీర్పు ఇస్తూ వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదని పేర్కొంది. 2018 నుంచి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఇక, అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చినందుకు వనమా వెంకటేశ్వర రావుకు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. కాగా, ఈ తీర్పుపై వనమా వెంకటేశ్వర రావు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం.