దిల్ సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు తీర్పును స్వాగతిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల (Dilsukh Nagar twin blasts) పాశవిక, అమానుష దాడి జరిగిన కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరార్ చేస్తూ ఎన్ఐఏ కోర్టు (NIA Court) తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఈ తీర్పును తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సమర్ధించి, ఉరిశిక్ష అమలు చేయాలని చెప్పిందని, హైకోర్టు నిర్ణయం హర్షనీయమని బండి సంజయ్ అన్నారు. అలాగే ఈ తీర్పును యావత్తు భారతీయ సమాజం స్వాగతిస్తుందని వ్యాఖ్యానించారు.
అశాంతి కాముకులు చేసిన నరమేధం ఎన్నో కుటుంబాలకు గర్భశోకాన్ని మిగిల్చిందని, పటిష్టమైన మన న్యాయవ్యవస్థ భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ తీర్పు గుణపాఠంగా మారనుందని కేంద్రమంత్రి రాసుకొచ్చారు. కాగా 2013, ఫిబ్రవరి 21వ తేదీన దిల్ సుఖ్‌నగర్ లో జంట పేలుళ్లు సంభవించాయి. బస్టాండ్ సమీపంలో ఒక బాంబ్ బ్లాస్ట్ అవ్వగా.. అక్కడి నుంచి 150 మీటర్ల దూరంలో మరో బాంబ్ పేలింది. నిందితులు టిఫిన్ బాక్స్‌లలో బాంబ్‌లను అమర్చి దిల్ సుఖ్ నగర్ లో జంట పేలుళ్లు జరిపారు. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా.. మరో 130 మందికి గాయాలయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ నిందితులకు ఉరి శిక్ష విధించాలని తీర్పునిచ్చింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. ఉరి శిక్షను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.