MLC Kavittha: మూసీ ప్రాజెక్టుపై ఎమ్మెల్సీ కవిత సంచలన విషయాలు
మూసీ ప్రాజెక్టు(Musi Project)పై బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు.
దిశ, వెబ్‌డెస్క్: మూసీ ప్రాజెక్టు(Musi Project)పై బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. డీపీఆర్(DPR)లు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు(World Bank)కు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఎమ్మెల్సీ కవిత(Kalvakuntla Kavitha) బయటపెట్టారు. 2024 సెప్టెంబరు 19న ప్రపంచ బ్యాంకు రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని స్పష్టం చేశారు. ఆ ప్రతిపాదనల్లో డీపీఆర్ ఉందని తేల్చి చెప్పారు. ఇప్పుడు డీపీఆర్‌లు లేవని ప్రజలకు, చట్టసభలకు తప్పుడు సమాచారం ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను, హైదరాబాద్‌ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడుతున్నారని కీలక ఆరోపణలు చేశారు. తెలంగాణను పదేళ్లు పాలించిన కేసీఆర్ ఏనాడూ రుణం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని గుర్తుచేశారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతోందని విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదల నుంచి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ బ్యాంకుకు పంపిన ప్రతిపాదనల్లో స్పష్టంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు(Musi Riverfront Development Project) అని స్పష్టంగా రాసుందని తెలిపారు. కానీ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాత్రం మూసీ ప్రాజెక్టు కాదు.. మరుగునీటి శుద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణాన్ని కోరామని తప్పుడు విషయం చెప్పారని విమర్శించారు. రియల్ ఎస్టేట్, ల్యాండ్ పూలింగ్ చేసి పెద్ద పెద్ద భవంతులు కడుతామని ప్రతిపాదనల్లో పేర్కొన్నారని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో భయానక పరిస్థితి నెలకొందని తెలిపారు. వారికి పునరావాసం ఎక్కడ కల్పిస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.