ఎమ్మెల్యేల రహస్య భేటీతో ఉలిక్కపడ్డ తెలంగాణ కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే?
కాంగ్రెస్‌లో తాజాగా కలకలం రేగింది. కాంగ్రెస్ప్రభుత్వంపై తిరుగుబాటు అంటూ సోషల్ మీడియా చేసిన దుమారంతో టీ.కాంగ్రెస్ ఉలిక్కిపడి.. అలర్ట్ అయ్యింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో తాజాగా కలకలం రేగింది. కాంగ్రెస్ప్రభుత్వంపై తిరుగుబాటు అంటూ సోషల్ మీడియా చేసిన దుమారంతో టీ.కాంగ్రెస్ ఉలిక్కిపడి.. అలర్ట్ అయ్యింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావడం వెనుకున్న శక్తులపై ఆరా తీసింది. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో టీపీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్తాజాగా ఫోన్‌లో మాట్లాడారు. ఇలాంటి సమావేశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏర్పాటు చేయడం ..సరికాదని హితవు పలికారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి లేదా.. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ఉలిక్కిపడ్డ రాజకీయ పక్షాలు
ఇదిఇలా ఉంటే.. తెలంగాణలో తిరుగుబాటు మీటింగ్ ఏర్పాటైందన్న ప్రచారం ఊపందుకోవడంతో కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలోనే అధికార పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటి కావడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది కాంగ్రెస్ సహా అన్ని పార్టీల్లోనూ పెను దుమారం రేపింది. ఈ ప్రచారానికి తెర దించేందుకు టీ-కాంగ్రెస్ సిద్ధమైంది. ఆ సమావేశానికి ఎవరూ హాజరుకాలేదంటూ మీడియాకు వివరణ ఇచ్చింది. తమ ప్రభుత్వంపై ప్రత్యర్థి పార్టీల సోషల్‌మీడియాలు ‘తిరుగుబాటు’ పేరుతో విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది. తప్పుడు ప్రచారం చేసిన వారి గుట్టు రట్టు చేయాలని సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది.
ఇంతకీ ఏమి జరిగింది?
నిధుల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతుందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రగిలిపోతున్నట్టు తెలిసింది. మంత్రులున్న నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయి తప్ప .. తమ నియోజకవర్గం రావడం లేదనే ఉద్దేశంతో కొందరు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఒకరిద్దరు మంత్రులు ...ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చేయడంలేదని వారు అభిప్రాయపడినట్టు సమాచారం. కనీస స్థాయిలో తమకు గౌరవం లభించడం లేదని వారు మథనపడినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే దీనిని కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు.. సోషల్ మీడియా వేదికగా తిరుగుబాటు సమావేశంగా చిత్రీకరించి ట్రోల్ చేశాయి. దీంతో ఉలిక్కి పడిన టీపీసీసీ సారథి మహేశ్‌కుమార్‌గౌడ్.. తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి ఫోన్ చేసి..రహస్య భేటీలపై ఆరా తీశారు. తాను పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కలిసి భోజనం చేయాలనే ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు అనిరుధ్‌రెడ్డి వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే.. తాము సీఎంకు, కాంగ్రెస్‌కు వ్యతిరేకం కాదని...సమస్యలపై చర్చించేందుకే భేటీ అయినట్టు మరికొందరు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు అనిరుధ్‌రెడ్డి త్వరలోనే సీఎం, పీసీసీ చీఫ్‌తో ప్రత్యేక భేటీ కానున్నారు.
నన్ను ఆహ్వానించారు – ఎమ్మెల్యే నాయిని
అనిరుధ్‌రెడ్డి తనను సమావేశానికి ఆహ్వానించిన మాట వాస్తవమేనని హన్మకొండ ఎమ్మెల్యే (వరంగల్‌వెస్ట్) నాయిని రాజేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. కలిసి భోజనం చేద్దామనడంతో సమావేశానికి హాజరయ్యానన్నారు. నియోజకవర్గ సమస్యలు-నిధులపై చర్చిద్దామని అనిరుధ్‌రెడ్డి తనకు మేసేజ్పంపారని తెలిపారు. ఆ మేసేజ్తన వద్ద ఉందన్నారు. తాను సమావేశానికి హాజరుకాలేదన్నారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆవేదన చెందారు.
నన్ను పిలవనే లేదు - ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
తనకు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినట్టు, తాను ప్రత్యేక సమావేశానికి హాజరైనట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని జుక్కల్ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. తాను గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నానన్నారు. సమావేశానికి హాజరయ్యే అవకాశమే లేదన్నారు. అయినా తనకు ఎలాంటి ఫోన్రాలేదని స్పష్టం చేశారు. తనపై కొందరు కావాలనే దుష్పప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. తనకు ఏదైనా సమస్యలు ఉంటే సీఎంతో మాట్లాడుతాను తప్ప వీధికెక్కనన్నారు.
పోలీసులకు బీర్ల అయిలయ్య ఫిర్యాదు
అధికార పార్టీలో అంతర్గత సమావేశమంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఫైర్ అయ్యారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను నియోజకవర్గంలో ఉన్నానని తెలిపారు. తాను సమావేశానికి హాజరయ్యానంటూ ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.