Rajnath Singh : దేశ భద్రతకు రెండో విఎల్‌ఎఫ్ స్టేషన్ అవసరం ఉంది

భారతదేశ రక్షణ, భద్రతకు రెండో విఎల్‌ఎఫ్ స్టేషన్ అవసరం ఎంతో ఉందని, అందుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు అని కేంద్ర రక్షాశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Update: 2024-10-15 15:44 GMT

దిశ రంగారెడ్డి బ్యూరో / వికారాబాద్ ప్రతినిధి / పరిగి : భారతదేశ రక్షణ, భద్రతకు రెండో విఎల్‌ఎఫ్ స్టేషన్ అవసరం ఎంతో ఉందని, అందుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు అని కేంద్ర రక్షాశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రం సమీపంలో పూడూర్ మండలం, దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ సైట్‌లో రూ.3,200 కోట్లతో 2,900 ఎకరాల్లో విస్తరించనున్నా భారత నావికాదళానికి చెందిన కొత్త వెరీ లో ఫ్రీక్వెన్సీ (విఎల్‌ఎఫ్) స్టేషన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రక్షా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ… విఎల్‌ఎఫ్ స్టేషన్ దేశంలోని సైనిక సామర్థ్యాలను మరింత విస్తరిస్తుందని, సాయుధ దళాలకు వరంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

హైటెక్ విఎల్‌ఎఫ్ స్టేషన్, ఒకసారి పని చేస్తే, అది కేవలం సైనిక స్థాపన మాత్రమే కాదని, జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక ఆస్తి అని ఆయన అన్నారు. ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా ఈ వీఎల్ఎఫ్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకోవడం పట్ల అయన సంతోషం వ్యక్తం చేశారు. దీని ఏర్పాటు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిన చొరవను అభినందించారు. ఈ విఎల్‌ఎఫ్ స్టేషన్ మన సముద్ర సంబంధ ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో నిర్మించబడుతోంది. ఇది సాయుధ దళాల కమాండ్ సెంటర్‌లతో మా నౌకలు అలాగే జలాంతర్గాముల మధ్య సురక్షితమైన, నిజ - సమయ కమ్యూనికేషన్‌ను నిర్ధారిస్తుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంపై ఎప్పటికప్పుడు పెరుగుతున్న ప్రపంచ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని భారత నౌకాదళానికి నిరంతరం సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా రక్షా మంత్రి నొక్కి చెప్పారు.

ఈ సందర్భాంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం మిస్సైల్స్ తయారు చేసే వ్యవస్థ నుంచి అనేక వ్యవస్థలు హైదరాబాద్ లోనే ఉన్నాయి, అందుకు తెలంగాణ బిడ్డగా చాలా గర్వంగా ఉందని అన్నారు. వి.ఎల్.ఎఫ్ ప్రాజెక్ట్ ఏర్పాటుతో దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో ముందడుగు వేయబోతుంది అన్నారు. వికారాబాద్ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా నేను, స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే వి.ఎల్.ఎఫ్ స్టేషన్ ప్రారంభించుకోవడం గర్వకారణం అన్నారు. వి.ఎల్.ఎఫ్ నిర్మాణాన్ని ఆడుకోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయి.

దీనివల్ల వచ్చే రేడియేషన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడుతుందని, స్థానిక ప్రజలకు అనేక ఇబ్బందులు వస్తాయని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వి.ఎల్.ఎఫ్ 1990 సంవత్సరంలోనే తమిళనాడులో ప్రారంభించారు. 34 సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. ప్రకృతి కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదు. అలాంటి 2వ లో ఫ్రీక్వెన్సీ వి.ఎల్.ఎఫ్ వికారాబాద్ ప్రాంతానికి రావడం మన జిల్లా ప్రజలకే కాక రాష్ట్ర ప్రజలందరి అదృష్టం అన్నారు.

2017లో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే భూ బదలాయింపు జరిగింది..

2017లో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే వికారాబాద్ జిల్లా, దామగుండం పరిధిలో వి.ఎల్.ఎఫ్ స్టేషన్ ఏర్పాటుకు భూ బదలాయింపు జరిగింది. అప్పుడు అన్నిటికి అంగీకరించిన వారు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? వివాదాలకు తెరలేపేవారు దేశ రక్షణ, దేశ భద్రత గురించి ఆలోచించాలని అన్నారు. దేశం ఉంటేనే మనం ఉంటాం, మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులను కూడా రాజకీయాల కోసం వివాదం చేసే ప్రయత్నం చేసే వారికి ఈ ప్రాజెక్టుతో కనువిప్పు కలగాలి అని అన్నారు. దామగుండం ఫారెస్ట్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వడం కూడా గత ప్రభుత్వంలోనే చోటుచేసుకుంది.

నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేవీ రాడార్ స్టేషన్ ప్రాజెక్టును ప్రారంభించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా కోరడంతో, అధికారులందరిని పిలిచి దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం రాజీ పడకూడదని ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపాం అన్నారు. “పర్యావరణ రక్షకులు, పర్యావరణ ప్రేమికులు ఒకటి ఆలోచించాలి. దేశము దేశంలోని ప్రజలు ఉంటేనే ఈ పర్యావరణం గురించి చర్చించుకోగలుగుతాం.” దేశ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితుల నుంచి కాపాడడానికి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. ఇక్కడ 400 ఏళ్ల నాటి రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది.

మందిరానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి నేవీ అధికారులను కోరారు. నావికా దళం ఇక్కడ ఏర్పాటు చేసే విద్యా సంస్థల అడ్మిషన్లలో స్థానికులకు మూడింట ఒక వంతు అవకాశం కల్పించాలని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మనోహర్ రెడ్డి, నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠీ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నేవీ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News