ఫోన్ ట్యాపింగ్ కేసులో సెకండ్ సిరీస్ స్టార్ట్.. గత BRS ప్రభుత్వ పెద్దల గుండెల్లో దడ షూరు..!

రాష్ట్రంలో సంచలనం సృష్టించి ఇంతకాలం అధికారుల చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు రాజకీయ ప్రముఖులను అంటుకోనున్నది.

Update: 2024-07-31 02:41 GMT
ఫోన్ ట్యాపింగ్ కేసులో సెకండ్ సిరీస్ స్టార్ట్.. గత BRS ప్రభుత్వ పెద్దల గుండెల్లో దడ షూరు..!
  • whatsapp icon

దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించి ఇంతకాలం అధికారుల చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు రాజకీయ ప్రముఖులను అంటుకోనున్నది. ఫస్ట్ ఫేజ్‌లో పోలీస్ ఉన్నతాధికారులపై దర్యాప్తు చేసిన పోలీసులు రెండో సిరీస్ దర్యాప్తును పొలిటీషియన్స్‌పైకి మరల్చనున్నారు. మంగళవారం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలు గత ప్రభుత్వ పెద్దల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు అప్పటి ప్రజాప్రతినిధులు, నాయకులు ఫోన్ ట్యాపింగ్ కుట్రకు తెరలేపారనే ప్రచారం జరిగింది.

ఫోన్ ట్యాపింగ్ ద్వారానే 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల సంభాషణలను విన్నారని అరెస్టయిన నిందితుల వాంగ్మూలాల్లో పేర్కొన్నారు. వ్యాపారులు, న్యాయమూర్తుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారనే అంశం దర్యాప్తులో బయటపడడంతో అందరూ షాక్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు వాటి లింకులపై ఫోకస్ పెట్టారు. పోలీసుల మొదటి సిరీస్ ఇన్వెస్టిగేషన్‌లో నిందితులంతా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే చేశామని చెప్పగా వారంతా అప్పటి ప్రభుత్వ పెద్దలను తప్పించడానికే అలా చెప్పినట్టు తెలిసింది.

దీంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టైల్‌ను మార్చి చేసిన దర్యాప్తులో వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, సిరిసిల్ల, జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఏర్పాటైన డెన్ పరిసర ప్రాంతాలు, సీసీ కెమెరాలు ద్వారా కొన్ని ప్రాథమిక ఆధారాలు దొరికినట్లు సమాచారం. ఆ తీగను పట్టుకుని దర్యాప్తును వేగవంతం చేయడంతో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు రాజకీయ నాయకులకు బిగుస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో నోటీసులు కేసీఆర్‌కు ఇస్తారా..? ఆయనతో పాటు ఇంకా ఎవరెవరికి నోటీసులు వెళ్తాయనే చర్చ జరుగుతున్నది.

ఇప్పటికే నలుగురు పోలీసులు జైలులో..

నలుగురు పోలీసుల అరెస్టుతో పాటు విదేశాలకు పారిపోయిన ఎస్ఐబీ విభాగం మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మీడియా చానెల్‌ను నిర్వహిస్తున్న శ్రవణ్ కుమార్‌ల పాత్ర ఉన్నట్టు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్‌లో స్పష్టమైంది. ఈ దర్యాప్తులో సేకరించిన ఎవిడెన్స్, నిందితులు, విట్‌నెస్‌ల వాంగ్మూలాలు, ఇతర సాంకేతిక ఆధారాలు, తెలియకుండా అధికారుల ఆదేశాలతో పని చేసిన అధికారులు, సిబ్బంది వారి స్టేట్‌మెంట్లతో కూడిన చార్జీషీటును దాఖలు చేయగా కోర్టు పరిగణలోకి తీసుకున్నది. ఈ కేసుకు సంబంధించి అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావులు అరెస్టయి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే.

కొత్త విషయాలు తెలుస్తున్నాయి: వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు తెలుస్తున్నాయని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఎస్ఐబీలో జరిగిన కార్యకలాపాలపై కేసు నమోదైందని, ఇప్పటి వరకు నలుగురు అరెస్టయి జైలులో ఉన్నారని, మరో ఇద్దరు తప్పించుకుని విదేశాల్లో దాక్కున్నారన్నారు. వారిని రప్పించేందుకు చట్టప్రకారం ప్రక్రియ కొనసాగుతున్నది చెప్పారు. ఇప్పటివరకు కొనసాగిన దర్యాప్తు ఆధారంగా సేకరించిన సాక్షాధారాలతో చార్జిషీట్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కోర్టు పర్మిషన్‌తో కొత్త విషయాలు, అనుమానితులపై దర్యాప్తు చేసేందుకు పర్మిషన్ తీసుకుంటామన్నారు. సాక్షాధారాలు దొరికిన వెంటనే మరికొందరిని అరెస్టు చేస్తామని వెల్లడించారు. రాజకీయ నాయకలు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.


Similar News