అక్రమ దందాకు చెక్ పెట్టడానికి సర్కార్ స్పెషల్ ప్లాన్

రేషన్ బియ్యం దారి మళ్లకుండా అరికట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ డీలర్లు, మిల్లర్లను కట్టడి చేసేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.

Update: 2024-09-25 02:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రేషన్ బియ్యం దారి మళ్లకుండా అరికట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ డీలర్లు, మిల్లర్లను కట్టడి చేసేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. అందులో భాగంగా రేషన్ బియ్యం సరిహద్దులు దాటిస్తున్న ముఠాలపై యాక్షన్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఆ ముఠాకు కొందరు లీడర్లు కూడా సపోర్ట్ చేస్తున్న విషయాన్ని గ్రహించి.. సదరు లీడర్లకు సైతం వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.

ప్రతి నెల రూ. 150 కోట్ల దందా

రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాతో ప్రతినెల ఖజానాకు దాదాపు రూ. 150 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు అధికారులు లెక్కలు తీసినట్టు తెలిసింది. ఈ దందాలో రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లు, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ అధికారుల ప్రమేయం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. వీరంత కుమ్మక్కై రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరికి సరిహద్దుల్లో ఉండే పోలీసులు, ట్రాన్స్ పోర్ట్ అధికారులు సహకరిస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ఈ అక్రమ దందాకు రేషన్ షాపుల వద్దే నాంది పలుకుతున్నట్టు ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని తినేందుకు ఇష్టం లేని లబ్ధిదారులు రేషన్ డీలర్లకే రూ. 8 నుంచి రూ. 10 వరకు విక్రయిస్తున్నారని, అలా సేకరించిన బియ్యాన్ని డీలర్లు రూ.5 నుంచి రూ. 8 లాభంతో మిల్లర్లకు విక్రయిస్తున్నట్టు నిఘా వర్గాలు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్టు టాక్ ఉంది. రేషన్ డీలర్ల నుంచి వచ్చిన బియ్యాన్ని మిల్లర్లు పాలిషింగ్ చేసి, కిలో బియ్యాన్ని రూ. 45 నుంచి రూ.50 వరకు వ్యాపారులకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం బియ్యం పొరుగు రాష్ట్రమైన ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.

మిల్లర్లకు సపోర్ట్ చేయొద్దని హెచ్చరికలు

రేషన్ బియ్యం మిల్లింగ్ చేస్తున్న మిల్లర్లకు సపోర్ట్ చేయొద్దని ప్రభుత్వం కాంగ్రెస్ లీడర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. మరోవైపు అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే బ్లాక్ లిస్టులో పెట్టిన మిల్లర్లకు అనుకూలంగా కొందరు లీడర్లు పైరవీలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన ఆ శాఖ మంత్రి సదరు లీడర్లకు వార్నింగ్ ఇచ్చినట్లు చర్చ జరుగుతున్నది. రేషన్ బియ్యం మిల్లింగ్ చేసే మిల్లర్లపై ఏకకాలంలో దాడులు చేయాలని, అలాగే రవాణా జరిగే సరిహద్దుల వద్ద తనిఖీలు చేసేందుకు ప్లాన్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.


Similar News