CLP మీటింగ్‌ను బహిష్కరించిన జగ్గారెడ్డి.. రేవంత్‌పై విమర్శలు

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని బహిష్కరించారు.

Update: 2022-03-06 10:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని బహిష్కరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. బడ్జెట్ సెషన్‌లో అవలంభించనున్న వైఖరిపై చర్చించేందుకు ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల్లోని సమస్యలను తెలుసుకోడానికి పార్టీ నేతలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. పార్టీలో ఎదురవుతున్న అవమానాలను, చేదు అనుభవాలను చర్చించనున్నట్లు జగ్గారెడ్డి ప్రతిపాదించారు. ఇది సందర్భం కాదని సీఎల్పీ నేతతో పాటు పార్టీ నేతలు కూడా సూచించారు. దీన్ని వ్యతిరేకించిన జగ్గారెడ్డి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్ళిపోయారు. సీఎల్పీ భేటీకి ముందే మీడియా సమావేశాన్ని నిర్వహించాలనుకున్న జగ్గారెడ్డి నిర్ణయాన్ని కూడా పార్టీ నేతలు అడ్డుకున్నారు.

సీఎల్పీ భేటీని బహిష్కరించిన తర్వాత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారని, పార్టీపరంగా ప్రోటోకాల్‌ను పాటించడంలేదని, అనేక సందర్భాల్లో చేదు అనుభవాలు తనకు ఎదురవుతున్నాయని వాపోయారు. వీటిని సీఎల్పీ సమావేశంలో చర్చించాలనుకున్నా పార్టీ అంతర్గత వివరాలు లేవనెత్త వద్దంటూ తనను వారించారని, ప్రయోజనం లేనప్పుడు సమావేశంలో పాల్గొనడం వృథా అని వ్యాఖ్యానించారు. అందుకే బహిష్కరించినట్లు వివరించారు.

Tags:    

Similar News