కొత్త నిబంధనలతో ఇసుక మాఫియా విలవిల.. స్దానిక ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు కొత్త విధానాలు తీసుకొచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు కొత్త విధానాలు తీసుకొచ్చింది. తక్కువ ధరలకే సామాన్యులకు ఇసుక లభించేలా వెసులు బాటు కల్పించింది. అడ్డగోలుగా విక్రయాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్న దళారులు శ్రమించకున్న రోజు లక్షలు సంపదన ఆగిపోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నిబంధనలను రద్దు చేయాలని, గత బీఆర్ఎస్హయాంలో ఉన్న విధానాలు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. కొత్త నిబంధనల పట్ల సానుకూలంగా వ్యక్తం చేసి వాటిని పాటించాలని సూచనలు చేసిన ప్రజాప్రతినిధులు బెదిరింపులు చేస్తూ స్ధానిక పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చిరిస్తున్నట్లు ఇసుక బజార్ల వద్ద ప్రచారం జరుగుతుంది.
ఇసుక మాఫియాలో చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం అన్ని రీచ్‌ల వద్ద నిఘా వ్యవస్ధను ప్రవేశపెట్టి సీసీటీవి కెమెరాలు, వేబిడ్జ్రి , జీపీఎస్, వీటిఎస్, బూమ్ బారియర్ అమలు చేస్తోంది. కమాండ్ కంట్రోల్ నుంచి అన్ని ఇసుకు రీచ్‌లకు 24 గంటల పాటు పర్యవేక్షణ చేస్తోంది. అక్రమ రవాణ, ఓవర్ లోడింగ్‌ను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు ఇసుక రీచ్‌లను తనిఖీలు చేసేలా మూడు షిప్ట్‌లలో నియమించింది. రోజు లక్ష టన్నుల ఇసుక తోడేలా చర్యలు తీసుకుంది. ఇసుక కాంట్రాక్టర్లకు ప్రతి 15 రోజులకు క్రమం తప్పకుండా చెల్లింపులు చేయనుంది.
హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ చుట్టు మూడు ఇసుక బజార్లను ప్రారంభించింది. మరో ఐదు బజార్లు ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలిస్తుంది. అవసరమైన నిర్మాణదారులకు దొడ్డు ఇసుక రూ. 1600, సన్న ఇసుక రూ. 1800 అమ్మకాలను చేయాలని ధరలు నిర్ణయించింది. త్వరలో జిల్లాల కేంద్రాల్లో కూడా ఇసుకు బజార్లను ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తోంది. కొత్త నిబంధనలతో ప్రభుత్వం ఆదాయం 1.6 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు చేరింది. రోజువారీ ఆదాయం రూ. 1.4 కోట్ల పెరిగింది. 2025–26 ఏడాదిలో రూ. 1000 కోట్ల నుంచి రూ. 1200 కోట్ల ఇసుక ఆదాయంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.
గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లకు రూ. వెయ్యి కోట్లు బిల్లులు పెండింగ్..
బీఆర్ఎస్ హయాంలో ఇసుక గుత్తేదార్లకు సంబంధించిన బిల్లులు రూ. 1000 కోట్ల వరకు చెల్లించలేదు. దీంతో వారంతా మైనింగ్ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నారు. ఉన్నతాధికారులను కలుస్తూ తమకు బిల్లులు వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు. అవసరమైతే ప్రభుత్వానికి కమిషన్ ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బిల్లుల వివరాలు పరిశీలిస్తే 2020 సంవత్సరంలో రూ. 140 కోట్లు, 2021 ఏడాదిలో రూ. 250 కోట్లు, 2022లో రూ. 300 కోట్లు, 2023 సంవత్సరంలో రూ. 260 కోట్లు పెండింగ్ ఉన్నట్లు అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బిల్లులపై ఇటీవల అధికార పార్టీ పెద్దలను గుత్తేదారులు కలిస్తే ఐదేళ్లపాటు ఒక రూపాయ ఇవ్వకుండా ఇసుకు రవాణా చేశారంటే ఏ స్ధాయిలో అక్రమంగా ఇసుక తరలించారో తమకు పూర్తిగా అర్ధమైతుందని నిలదీసినట్లు తెలిసింది. రెండు మూడు నెలలకు బిల్లలు రాకుంటే ప్రభుత్వంపై అడ్డగోలు ప్రచారం చేస్తే కాంట్రాక్టర్ల గత ప్రభుత్వాన్ని ఎందుకు బిల్లులు అడగలేదని ప్రశ్నించినట్లు సమాచారం.
తూకం వంతెనల మోసాలు..
గత పాలకులు ఇసుక సరఫరాపై నియంత్రణ చేయకపోవడంతో ఇసుక దళారులు ఇష్టానుసారంగా అమ్మకాలు చేశారు. తూకం వంతెనల నిర్వహకుల సహకారంతో ఒక లారీకి 10 టన్నులు అధికంగా ఉన్నట్లు దొంగ రసీద్ బిల్లలు ఇవ్వడంతో ఇసుక మాఫియా ఒక లోడ్‌పై రూ. 15 వేల వరకు సంపాదించుకునేవారు. రోజుకు మూడు నుంచి ఐదు లారీలు అమ్మకాలు చేస్తే రోజుకు రూ. 50 వేల వరకు జేబులో వేసుకునే వారు. మరోవైపు లారీల యాజమానులను కూడా దోపీడీ చేశారు. టన్ను ఇసుకు రూ. 1300 ఉంటే మాఫియా రూ. 900 నుంచి రూ. 1100 వరకు విక్రయించేవారు. వారికి నేరుగా నిర్మాణ దారులతో సంబందాలు ఉండేవి కావు వారు కూడా మధ్య దళారులపై ఆధారపడి ఉండేవారు. రెండువైపులా దోచుకున్న ఇసుక మాఫియా ప్రభుత్వ కఠిన నిబంధనలతో పాటు ఇసుక బజార్లు ఏర్పాటు చేసి ధరలు ఖరారు చేయడంతో ఇసుక మాఫియా దోపీడీకి కళ్లెం పడింది.