పక్క రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీల ఏర్పాటు వెనుక ఉంది ఇతడే..!

Update: 2022-03-04 17:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ ఫలానా రాష్ట్రంలో పర్యటిస్తున్నాడని తెలిస్తే చాలు ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. అంటే ఆ రాష్ట్ర ప్రజలు అభిమానంతో ఏర్పాటు చేసినవి కాదు. వాటిని ఏర్పాటు చేసేది మాత్రం తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తే. మొన్న మహారాష్ట్ర, ఏపీ, నిన్న యూపీ, నేడు జార్ఖండ్ లో ఏర్పాటు చేసి చర్చనీయాంశంగా మారాడు తెలంగాణ సాయి. వరంగల్ జిల్లా కొడకండ్ల గ్రామానికి చెందిన రమేష్, ప్రమీల దంపతుల కుమారుడు పి. సాయి సప్త కుమార్ (తెలంగాణ సాయి) కుత్బుల్లాపూర్ గాజులరామారం మల్లారెడ్డి నగర్‌లో ప్రస్తుతం ఉంటున్నాడు. గన్ ఫౌండ్రీ దగ్గర ఉండే ప్రభుత్వ పాఠశాల ఆలియాలో చదువుకున్నాడు. విద్యార్థి దశ నుంచి ఉద్యమంలో కీలకంగా పనిచేశాడు. 2010లో ఉద్యమ సమయంలో చురుగా పాల్గొంటూ తన పేరును తెలంగాణ సాయి అని పరిచయం చేసుకుని ఉద్యమంలో అడుగుపెట్టాడు. కేసీఆర్ అంటే అభిమానం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కలలుగన్నాడు ఆ కోరిక తీరింది. ఇప్పుడు దేశ ప్రధాని కావాలని విస్తృత ప్రచారం కల్పించాలన్న లక్ష్యంతో సొంత ఖర్చులతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాడు.

ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అడ్డ గుజరాత్ రాష్ట్రంలోని ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్, చార్‌రస్తా జంక్షన్, మోడీ ఇంటి సమీపంలోని జంక్షన్ వద్ద, ఏపీలో సైతం కేసీఆర్ జన్మదిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చర్చనీయాంశంగా మారాడు. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముంబాయి ప్రాంతంలో బాంద్రా, కాలానగర్, వెస్టర్న్ హైవే బ్రిడ్జి వద్ద స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అంతే కాకుండా నిన్న యూపీలోని వారాణాసిలో, నేడు జార్ఖండ్‌లోని రాంచీలో ఏర్పాట్లు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో తెలంగాణ సాయి చర్చనీయంగా మారాడు. ఇదిలా ఉంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా 2014 నుంచి నేటి వరకు కొనసాగుతూ వస్తున్నారు. ఏ నామినేటెడ్ పదవి లేకున్నా తన అభిమానాన్ని ఫ్లెక్సీల రూపంలో చాటుకుంటూనే వస్తున్నాడు. సీఎం కేసీఆర్ పై ఉన్న అభిమానం వల్లే దేశవ్యాప్తంగా కేసీఆర్ పేరు ప్రచారంలో ఉండాలని, ప్రధానిగా చూడాలన్నదే తన సంకల్పం అని తెలంగాణ సాయి 'దిశ'కు తెలిపారు.

Tags:    

Similar News