రైతుబంధు సొమ్ము రికవరీ..? అక్రమాలపై ‘ఆర్ఆర్’ యాక్ట్!
నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్‌కు రైతుబంధు కింద మంజూరు చేసిన పెట్టుబడి సాయాన్ని రికవరీ చేసేందుకు ఆర్ఆర్ (రెవెన్యూ రికవరీ) యాక్ట్‌ను ప్రయోగించే చాన్స్ కనిపిస్తున్నది.
నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్‌కు రైతుబంధు కింద మంజూరు చేసిన పెట్టుబడి సాయాన్ని రికవరీ చేసేందుకు ఆర్ఆర్ (రెవెన్యూ రికవరీ) యాక్ట్‌ను ప్రయోగించే చాన్స్ కనిపిస్తున్నది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని మూడు సర్వే నంబర్లలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్‌కు మంజూరు చేసిన రైతుబంధు సాయాన్ని రికవరీ చేయాలని స్థానిక తహశీల్దార్‌ను ఆ జిల్లా కలెక్టర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేస్తే రూ.వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరే అవకాశమున్నది. - దిశ, తెలంగాణ బ్యూరో
రైతుబంధు అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించే అవకాశం కనిపిస్తున్నది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని మూడు సర్వే నంబర్లలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కు మంజూరు చేసిన రైతుబంధు పెట్టుబడి సాయాన్ని రికవరీ చేయాలని ఆ జిల్లా కలెక్టర్.. తహశీల్దార్ ను ఆదేశించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఐదేండ్లుగా వేలాది మంది అక్రమార్కులు రైతుబంధు పథకం కింద రూ.లక్షలు సాయం పొందారు. నాకు రైతుబంధు కింద రూ.లక్షలు వస్తున్నాయంటూ గొప్పగా చెప్పిన నాయకులు సైతం ఉన్నారు. నాలుగు దశాబ్దాల క్రితమే ప్లాట్లు చేసిన అమ్మేసిన భూములకు సైతం దొడ్డిదారిన పాసు పుస్తకాలు పొంది ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి సంఖ్య వేలల్లోనే ఉన్నది. ఒక్కొక్కరి ఖాతాల్లో ఈ ఐదేండ్ల కాలంలో రూ.లక్షల్లో జమ అయ్యాయి. పెట్టుబడి సాయం కింద అందించే పథకం ద్వారా ఉద్దేశపూర్వకంగానే లబ్ధి పొందారు. ఈ జాబితాలో ప్రధానంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తే.. రూ. వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరే అవకాశమున్నది.
మేడ్చల్ లో అక్రమార్కులకు నోటీసులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని 38, 39, 40లో సర్వే నంబర్లలో అమ్మేసిన 33 ఎకరాల భూమికి మోత్కుపల్లి యాదగిరి రెడ్డి పట్టాదారు పాసు పుస్తకం తీసుకున్నారు. ఐదేండ్లుగా రైతుబంధు ద్వారా రూ.20 లక్షల వరకు ప్రయోజనం పొందారు. ఈ విషయాన్ని ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్, సామాజిక కార్యకర్త మన్నె నర్సింహారెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపిన అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. 1981 నుంచి లే అవుట్లుగా (శారదానగర్) మారిన 33 ఎకరాలకు మోత్కుపల్లి యాదగిరిరెడ్డి రైతుబంధు కింద రూ.20 లక్షల వరకు తీసుకున్నారు. ఈ మొత్తంలో నాన్ అగ్రికల్చర్ గా మారిన ల్యాండ్ కి సంబంధించిన అమౌంట్ రూ.16.80 లక్షలను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయాలని కలెక్టర్ లేఖ నం.డి1/1115/2024, తేదీ.29.06.2024 ద్వారా ఘట్ కేసర్ తహశీల్దార్ ను ఆదేశించారు. అంటే ఒక్క రైతు నుంచే ఇంత అమౌంట్ రానున్నది. దీంతో అధికారులు తలుచుకుంటే రైతుబంధు పేరుతో అక్రమంగా పొందిన పెట్టుబడి సాయాన్ని వసూలు చేయాలనుకుంటే రూ. వేల కోట్లు ప్రభుత్వ ఖజానాలో చేరే అవకాశమున్నది. అయితే అధికారులు ఆ సొమ్మును వసూలు చేస్తారా? యాక్షన్ తీసుకుంటారా? అన్నది అధికారుల నిజాయితీపైనే ఆధారపడి ఉంటుంది.
చర్చకు ముందు చర్యలు
రాష్ట్రంలో వేలాది మంది రైతులు అమ్మేసిన భూములకు కింది స్థాయిలో ఉన్న అధికారులను ప్రలోభాలకు గురిచేసి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. వాటి ద్వారా ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్నారు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉందని ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్ మన్నె నర్సింహారెడ్డి సూచిస్తున్నారు. సదరు అధికారులపైనా తగిన చర్యలు తీసుకోవడం ద్వారా అక్రమాలు పునరావృతం కాకుండా చూసే అవకాశముంటుందంటున్నారు. గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడు రైతాంగానికి సాయమందించే రైతుభరోసా స్కీమ్ కు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఎవరికి సాయం కావాలి? ఎవరిని అనర్హులుగా ప్రకటించాలి? అన్న అంశంపై పెద్ద చర్చ నడుస్తున్నది. దానికి ముందే ఈ ఐదేండ్లలో అక్రమంగా ప్రభుత్వ సొమ్మును పొందిన వారిపై యాక్షన్ తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా చర్యలు చేపడితే రూ.వేల కోట్లు వస్తాయంటున్నారు.
డేటా సరిపోలిస్తే.. వివరాలు స్పష్టం
ధరణి పోర్టల్ సృష్టించిన మాయాజాలంతో 40 ఏండ్ల క్రితం వెంచర్లు ప్లాట్లుగా అమ్మేసినవి కూడా వ్యవసాయ భూములుగా రికార్డుల్లోకి ఎక్కాయి. పాత పట్టాదారుల పేరిట కొత్త పాసు పుస్తకాలు అందాయి. నాలా కన్వర్షన్ చేయకుండానే ఇల్లీగల్ లేదా పంచాయతీ అనుమతితో లే అవుట్లు చేసి అమ్మేసిన విస్తీర్ణం వేల ఎకరాల్లో ఉన్నది. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వారందరికీ రైతుబంధు ఇవ్వడం ద్వారా రూ.వేల కోట్లు దుర్వినియోగమయ్యాయి. అనర్హులకు అందాయి. ఈ విషయం రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, డీటీసీపీ, హెచ్ఎండీఏ, పురపాలక, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖల అధికారులకు తెలుసు. ఆ భూములు ఏనాడో నివాస ప్రాంతాలుగా మారాయని, కొన్ని ప్రాంతాల్లో ఇండ్లు కూడా నిర్మించారని తెలుసు. కానీ ఐదేండ్ల కాలంలో సాయం అందిస్తూనే ఉన్నారు. ఇలాంటి భూములు ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, వరంగల్ జిలాల్లోనే అధికంగా ఉన్నాయి. అయితే ధరణి పోర్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఈసీ డేటా సరిపోలిస్తే ఇలాంటి భూముల వివరాలు స్పష్టంగా తెలిసిపోతాయి.
రైతుభరోసా వర్తింపజేయొద్దని నిర్ణయం!
వెంచర్లు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి పెట్టుబడి సాయం వర్తింపజేయొద్దని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వ్యవసాయం చేస్తున్న వారికే పెట్టుబడి సాయం అందజేయాలని భావిస్తున్నది. సర్కారు చేపడుతున్న అభిప్రాయ సేకరణలోనూ రైతాంగం అదే సూచిస్తున్నది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంచనాల ప్రకారం సుమారు ఆరు లక్షల ఎకరాలకు పైగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి రైతుబంధు పొందారు. ఇది 10 లక్షల ఎకరాలకు పైగానే ఉండొచ్చని అధికారులూ అంచనా వేస్తున్నారు. ఈ సొమ్మంతా సంపన్న వర్గాల చేతుల్లోకే పోయింది. దీంతో దీన్ని తిరిగి వసూలు చేయడంలో తప్పేం లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు.
పరిష్కారం కాని ‘హ్యాపీ హోమ్స్’ ఇష్యూ
హ్యాపీ హోమ్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ మేడ్చల్ మండలం రావల్ కోల్, షాజాదిగూడ, సోమారం గ్రామాల్లో నేచర్ 1, నేచర్ 2, అర్బన్ టౌన్ పేరిట వెంచర్లు చేసి అమ్మేసింది. ఇదంతా 24 ఏండ్ల క్రితమే జరిగింది. అందరూ సేల్ డీడ్స్ ద్వారానే ప్లాట్లు కొనుగోలు చేశారు. కానీ ధరణి పోర్టల్ లో రైతుల పేర్లు రావడంతో తిరిగి కొత్త పాసు బుక్స్ పొందారు. వీటిని రద్దు చేయాలంటూ 2020 నుంచి తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, సీసీఎల్ఏకు హ్యాపీ హోమ్స్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎన్నోసార్లు మొర పెట్టుకున్నారు. మేడ్చల్ కలెక్టర్ గా ఎస్.హరీశ్ పని చేసిన కాలంలోనే దీన్ని గుర్తించారు. ఇల్లీగల్ గా ఆక్రమించుకోవడంతోపాటు రైతుబంధు క్లెయిమ్ చేస్తున్నారని సీసీఎల్ఏకు లేఖ (నం.డి1/2125/2021, తేదీ.27.11.2021) ద్వారా వివరించారు. రావల్ కోల్ లో సర్వే నం.196, 195, 177, 174, 179, 192, 175, 194లో 12.25 ఎకరాలు, షాజాదిగూడలో సర్వే నం.76, 77, 72, 70, 71, 73లో 11.29 ఎకరాలు, సోమారంలో సర్వే నం.65, 62, 63, 86, 72, 81లో 12.34 ఎకరాల్లో నాలా కన్వర్షన్ చేయకుండా లే అవుట్ చేసి అమ్మేసినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను లేఖలో ప్రస్తావించారు. అయినా ఇప్పటి వరకు ప్లాట్ల యజమానులకు న్యాయం జరగలేదు. ఇల్లీగల్ గా రైతుబంధు తీసుకున్న వారిపైనా చర్యలు తీసుకోలేదు.
కొన్నది పెద్దలే!
రాష్ట్రంలోని పలు చోట్ల మూడు, నాలుగు దశాబ్దాల క్రితమే ప్లాట్లుగా మారిన స్థలాలను ధరణి పోర్టల్ ని అడ్డం పెట్టుకొని వ్యవసాయ భూములుగా కొనుగోలు చేశారు. ప్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురి చేసి కబ్జా చేస్తే పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదు చేసిన ఉదంతాలు సైతం ఉన్నాయి. అయితే వారంతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బినామీలు, వారసులు కావడంతో ప్లాట్ల యజమానులు ఏం చేయలేకపోతున్నారు. ఓ మాజీ మంత్రి ప్లాట్ల స్థలాన్ని కొనుగోలు చేసి ఫంక్షన్ హాల్ నిర్మించారు. మరో మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే ప్లాట్ల యజమానులపైనే ఉల్టా కేసులు పెట్టించారు. ఇలా వేలాది ఎకరాలను హస్తగతం చేసుకున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వ్యవసాయ భూములుగా మార్చి రైతుబంధు పొందిన ఘనుల సంఖ్య వేలల్లోనే ఉంది. వీరందరిపైనా యాక్షన్ తీసుకుంటే లక్షలాది మంది ప్లాట్ల యజమానులకు న్యాయం జరుగుతుంది.