ఆర్టీసీని మరింత సమర్ధవంతంగా నడిపిస్తాం : మంత్రి పొన్నం

ఆర్టీసీని మరింత సమర్ధవంతంగా నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Update: 2024-09-29 08:42 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆర్టీసీని మరింత సమర్ధవంతంగా నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లాకు కేటాయించిన 74 బస్సుల్లో తొలి విడతలో 33 విద్యుత్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఈ రోజు ప్రారంభించిన బస్సులు కరీంనగర్ నుంచి జేబీఎస్ వరకు నడపనున్నట్లుగా తెలిపారు. ఆర్టీసీనే స్వయంగా ఈ బస్సులు కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్​ ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకురానుందని, జేబీఎస్‌ సంస్థ ఎన్‌ఈబీపీ ఆధ్వర్యంలో దాదాపు 500 బస్సులను అందుబాటులోకి తీసుకురానునట్లు మంత్రి తెలిపారు.

ప్రభుత్వం గ్రాట్యుటీ పైన కొన్ని బస్సులు తీసుకుని నడిపించే ప్రయత్నం కూడా చేస్తుందన్నారు. ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్న మంత్రి వెల్లడించారు. దసరా పండుగలోపు పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆర్టీసీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ వీసీ సజ్జనర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ కుమార్, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, తదితరులు పాల్గొన్నారు.


Similar News