పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాం.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో వచ్చిన తెలంగాణ.. నేడు లిక్కర్, లిఫ్ట్, లీక్ స్కాం గా మారిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అనేది అతి పెద్ద కుంభకోణమని, ముఖ్యమంత్రి ఇప్పటివరకు విద్యావ్యవస్థపై ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదని విమర్శించారు. సోమవారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో ఏర్పాటు చేసిన నిరుద్యోగుల భరోసా సదస్సులో పాల్గొని ఆర్ఎస్పీ ప్రసంగించారు. నిరుద్యోగులకు అండగా ఉంటూ.. సమస్యలపై పోరాడడానికి ఏం చేయడానికైనా సిద్ధమని హామీ ఇచ్చారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, ఇతరులు ఎవరైతే కస్టడీలో ఉన్నారో వారికి ప్రమాదం ఉందని ఆరోపించారు.
వారి వద్ద విలువైన సమాచారం ఉందని, కావాలనే వారిని ప్రశ్నించడం లేదన్నారు. పేపర్ లీకేజీ పై సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నామని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, బోర్డు సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉన్న కంప్యూటర్లకు ఇంటర్నెట్, యూఎస్బీ యాక్సెస్ ఉండదని మరి ఎలా పెన్ డ్రైవ్ లో కాపీ చేశారని నిలదీశారు. ప్రభుత్వానికి విచారణ సంపూర్ణంగా చేయాలనే చిత్తశుద్ధి లేదన్నారు. లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలని, లీకులో బాధ్యులైన నిందితులకు యావజ్జీవ శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.
మొత్తం 15 రకాల ప్రశ్నపత్రాలు లీకయ్యాయని, టీఎస్పీఎస్సీ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రవీణ్ సర్వీస్ కమిషన్ గా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుడు కమిషన్ మెంబర్, ముఖ్యమంత్రి ఆఫీసులో పనిచేసిన పెద్ద ఆఫీసర్ బంధువు కూడా కమిషన్ మెంబరే అని అన్నారు. 2019 సమయంలో కమిషన్ మెంబర్ ఒకాయన ఇంటర్ పేపర్ లీక్ చేసి జైలుకు వెళ్లిన వ్యక్తి అని పేర్కొన్నారు.
సాఫ్ట్ వేర్ రాజకీయాలకు కోసం కాకుండా.. విద్యార్థుల కోసం ఎందుకు వాడారు..? అని ప్రశ్నించారు. బీజేపిలో పనిచేసే ఐటీ కార్యకర్తలను మీరెలా టీఎస్పీఎస్సీలో నియామకం చేశారు.? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీటీసీ కూడా గ్రూప్ 1 పాసయ్యారని, గ్రూప్ 1 పై ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వాకంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, వారికి నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
బీఎస్పీ పార్టీలో ఆమరణ నిరాహార దీక్ష ఉండదని, కానీ తాను నిరుద్యోగుల కోసం ముందుకు వచ్చానని తెలిపారు. నిరుద్యోగుల కోసం హెల్ప్ లైన్, పౌష్టికాహారం, కౌన్సెలింగ్ సెంటర్లు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్స్ ఎందుకు ఎనిమిదేళ్లుగా పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రగతి భవన్ లోనే ఏసీ ఉండాలా..? విద్యార్థుల స్టడీ సెంటర్ లో ఉండొద్దా..? అని ప్రశ్నించారు. ఇక్కడ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల బాధలు.. 30 లక్షల మంది నిరుద్యోగ యువతను పట్టించుకోకుండా.. ఢిల్లీలో సీఎం కూతురు కవితను కాపాడుకోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి ఢిల్లీకి పంపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానందరావు, రాష్ట్ర మహిళా కన్వీనర్ అనిత రెడ్డి, అధికార ప్రతినిధులు వెంకటేష్ చౌహాన్, డా. సాంబశివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.