బండి రెండో విడత పాదయాత్రకు రూట్ మ్యాప్.. ఆ రోజు నుంచే స్టార్ట్

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​31 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 14వ తేదీ

Update: 2022-04-07 14:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​31 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 14వ తేదీన జోగులాంబ జిల్లా నుంచి ప్రారంభమయ్యే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన 391 కిలోమీటర్ల మేర పర్యటన చేపట్టనున్నారు. మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు, 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో 97 గ్రామ పంచాయతీల్లో పాదయాత్ర చేపట్టి తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు. తొలిరోజు జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ దేవాలయంలో పూజలు నిర్వహించి ఆ రోజు అక్కడే బస చేయనున్నారు. ఏప్రిల్ 15వ తేదీన జోగులాంబ దేవాలయం నుంచి యాత్రను ప్రారంభించే సంజయ్ గద్వాల సమీపంలోని నిర్వహించే బహిరంగసభ వేదిక వరకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభకు జాతీయ స్థాయి నేత హాజరు కానున్నారు. రాత్రి బహిరంగసభ వేదిక సమీపంలోనే బస చేసే సంజయ్ 16వ తేదీ నుంచి యాత్రకు విరామం ఇవ్వకుండా కొనసాగించాలని నిర్ణయించారు. రెండో విడత పాదయాత్ర మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోకసభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చేవెళ్ల నియోజకవర్గంలోని మహేశ్వరం నియోజకవర్గంలో ముగించనున్నారు. గద్వాల, మక్తల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల, వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, మైసిగండి, మహేశ్వరం వరకు కొనసాగనుంది. రెండవ విడత పాదయాత్రలో ప్రారంభం, ముగింపు సందర్భంగా కేవలం రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ శ్రేణులు నిర్ణయించారు. మరో ఎనిమిది చోట్ల మధ్య స్థాయి సభలు నిర్వహించాలని ఖరారు చేశారు. బండి సంజయ్​ పాదయాత్ర రోజుకు 13 నుంచి 14 కిలోమీటర్లు మాత్రమే సాగించేలా శ్రేణులు రూట్ మ్యాప్ సిద్ధం చేశాయి. ఇదిలా ఉండగా పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా రానున్నారు.

ఒక్కో రోజు ఒక్కో ముఖ్య నేత : దుగ్యాల ప్రదీప్​కుమార్

బండి సంజయ్​ చేపట్టే రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఒక్కో రోజు ఒక్కో ముఖ్య నేత హాజరవుతారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి వెల్లడించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పాదయాత్ర నిర్వాహణ కోసం 30 కమిటీలను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. 31 రోజుల పాటు జరిగే పాదయాత్రలో రెండు వందల మంది కార్యకర్తలు పాల్గొంటారన్నారు. బండి సంజయ్ పాదయాత్రలో జాతీయ పదాధికారుల మొదలు, కేంద్ర మంత్రుల వరకు ప్రతి రోజు ఒక్కో నేత అయినా హాజరవుతారని తెలిపారు. మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు ఇన్​చార్జీలుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. పాదయాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటామని వారు స్పష్టం చేశారు. ఇన్నిరోజులు తమకు తిరుగులేదని విర్రవీగిన టీఆర్ఎస్ కోరలు ఈ పాదయాత్రతో పీకేసినట్లయిందన్నారు. కేంద్రంపై ఆరోపణలు చేస్తూ మూడోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని, ఆయనకు బుద్ధి చెప్పేందుకు అంబేద్కర్ జయంతి రోజే యాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కార్యకర్తలు, ప్రజలను యాత్రలో భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు. మొదటి విడుత యాత్రలో 26 మంది జాతీయ నాయకులు పాల్గొన్నారని వారు గుర్తుచేశారు.

Tags:    

Similar News