పాతబస్తీలో రిగ్గింగ్..? రీ పోలింగ్ చేయాలని కాంగ్రెస్ రిక్వెస్ట్!
ఈ సార్వత్రిక ఎన్నికల్లో పాతబస్తీలో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : ఈ సార్వత్రిక ఎన్నికల్లో పాతబస్తీలో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. మజ్లిస్ పార్టీ ఎప్పటిలాగానే ఈ సారి కూడా బోగస్ ఓట్లు వేయించిందని కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తున్నది. దీంతో అన్ని సీసీ టీవీ కెమెరాల పరిశీలన పూర్తయిన తర్వాతనే కౌంటింగ్ నిర్వహించాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
ముఖ్యంగా చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహుదూర్ పూర నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగినట్లు తాము కొన్ని ప్రాథమిక ఆధారాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పూర్తి స్థాయి పరిశీలన తర్వాతనే కౌంటింగ్ చేయాలని, లేదంటే రీ పోలింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ కోరింది.
ఇక పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలపై ఏఎంఐఎం నాయకులు, కార్యకర్తలు దాడులు చేశారని కాంగ్రెస్ తన ఫిర్యాదులో స్పష్టం చేసింది. పోలింగ్ డే సందర్భంగా ఉద్రిక్త వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఎంఐఎం తన అహంకారాన్ని ప్రదర్శించినట్లు ఈసీ కంప్లైంట్‌లో పేర్కొన్నది. పోలింగ్ కేంద్రాలలో కేవలం ఎంఐఎం ఏజెంట్లే ఎట్లా? ఉంటారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ప్రశ్నించారు.
ఇతర పార్టీల ఏజెంట్లను రాకుండా అడ్డుకొని రిగ్గింగ్‌కు పాల్పడ్డారని పార్టీ ఆరోపించింది. ఆ మూడు నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్‌లలో ఏర్పాటు చేసిన అన్ని వెబ్ కెమెరాలు, సీసీ కెమెరాలను తనిఖీ చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా పోలింగ్ జరగాలంటే ఇది చాలా అవసరమని నిరంజన్ నొక్కి చెప్పారు.