హైడ్రా మరో పెను సంచలనం.. దుర్గంచెరువు చుట్టూ ఉండే ఇళ్లు, ఆఫీస్‌లకు నోటీసులు

హైదరాబాద్‌లోని దుర్గంచెరువు ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ చేశారు. దుర్గంచెరువును ఆనుకుని పలువురు ప్రముఖుల ఖరీదైన భవనాలు నిర్మించినట్లు, అవన్నీ ఎఫ్‌టీఎల్‌ జోన్‌లో పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Update: 2024-08-29 04:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని దుర్గంచెరువు ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ చేశారు. దుర్గంచెరువును ఆనుకుని పలువురు ప్రముఖుల ఖరీదైన భవనాలు నిర్మించినట్లు, అవన్నీ ఎఫ్‌టీఎల్‌ జోన్‌లో పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో గురువారం ఉదయం దాదాపు 204 మందికి శేరిలింగంపల్లి తహశీల్దార్ నోటీసులు పంపారు. 30 రోజుల్లోగా ఎవరికి వారే అక్రమంగా, నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలు అన్నీ స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేకపోతే తామే స్వయంగా రంగంలోకి దిగి కూల్చివేస్తామని అధికారులు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. ఎఫ్‌టీఎల్‌ జోన్‌లోనే అద్దెకు ఉంటున్న తిరుపతి రెడ్డి ఇంటికి ఈ ఉదయం అధికారులు నోటీసులు జారీ చేశారు. నెక్లార్‌ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్‌, అమర్‌ కోఆపరేటివ్‌ సొసైటీలోని నివాసాలకు నోటీసులు అందజేశారు.

కాగా, రాష్ట్రంలో హైడ్రా దూకుడు కొందరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. చెరువులు, నాళాల ఆక్రమణలకు పాల్పడి, అనుమతులు లేకుండా భవనాలు నిర్మించినవారి జాబితాలను ఇప్పటికే హైడ్రా సేకరించింది. ఒక్కొక్కరిగా అందరి భరతం పడుతూ వస్తోంది. ప్రస్తుతం హైటెక్‌సిటీలోని రాయదుర్గం, మాదాపూర్‌ పరిధిలో ఉండే దుర్గం చెరువు చుట్టూ విలాసవంతమైన భవనాలు నిర్మించినవారు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో మొత్తం 204 ఇండ్లకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసారు. వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నారు.


Similar News