నేడు సీఎంగా రేవంత్ ప్రమాణం.. ప్రజా తీర్పునకు పట్టాభిషేకం

ప్రజా తీర్పునకు నేడు పట్టాభిషేకం జరగనున్నది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Update: 2023-12-07 01:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజా తీర్పునకు నేడు పట్టాభిషేకం జరగనున్నది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ప్రమాణం చేపట్టనున్నట్టు టాక్. ఇప్పటికే మంత్రి పదవి చేపట్టే నేతలకు హైకమాండ్ నుంచి సమాచారం అందినట్టు తెలిసింది. దీంతో కుటుంబ సమేతంగా ఆయా లీడర్లు నేడు ఎల్బీ స్డేడియానికి రానున్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్​గెస్టులుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.

వీరితో పాటు దేశ వ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం వస్తున్నారు. రాష్ట్రంలోనూ 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు అందాయి. అన్ని రాజకీయ పార్టీలు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాలకూ సైతం ఇన్విటేషన్లు ఇచ్చారు. ప్రత్యేక అతిథులుగా అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలకు సైతం ఆహ్వానాలు వెళ్లాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులకు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు. రాష్ట్ర ప్రజలను కూడా కాంగ్రెస్ ఓపెన్‌గా ఇన్వైట్ చేసింది.

కృతజ్ఞత సభ

సీఎం ప్రమాణ స్వీకారణ తర్వాత ఎల్బీస్టేడియంలో కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రజలు తరపున కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలపనున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు తెలంగాణ హామీ, సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాలు, ఆ తర్వాత వచ్చిన ఇబ్బందులు వంటివి ప్రజేంటేషన్ రూపంలో చదవనున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి కాంగ్రెస్ చేసిన కృషి, ఇచ్చిన ప్రాధాన్యతను వివరించనున్నారు. అనంతరం ఎల్బీస్టేడియంలో దాదాపు రెండు నిమిషాలు పాటు హర్షధ్వనులతో ప్రజలు సోనియా గాంధీకి థాంక్స్ చెప్పనున్నారు. ఆ తర్వాత సోనియా గాంధీ కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

ఎన్నికల ప్రచారంలో వీడియో రూపంలో ఇచ్చిన సందేశంపై క్లారిటీ ఇస్తూనే కాంగ్రెస్.. తెలంగాణ పట్ల చూపిన వైఖరి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాలు, పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు వంటివన్నీ క్షుణ్నంగా వివరించే చాన్స్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలకు సోనియా గాంధీ కూడా ధన్యవాదాలు తెలియజేయనున్నారు. ఇక ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సైతం మాట్లాడనున్నారు. రేవంత్ పార్టీలోకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితితో పాటు సీనియర్ల సహకారం, టిక్కెట్లు పంపిణీ వంటి విషయాలన్నింటినీ షేర్ చేసుకోనునున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందజేసిన స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలుకు కూడా ఈ సభలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయనున్నారు.

పొలిటికల్ విమర్శలు లేకుండానే

సీఎం పదవి చేపట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి తన మొదటి ప్రసంగాన్ని ఎల్బీ స్డేడియం వేదికగా వినిపించనున్నారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినందుకు థాంక్స్ చెబుతూనే పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుతామని మరోసారి ప్రామిస్ చేయనున్నారు. ఆరు గ్యారంటీల ఫైల్‌పై వెంటనే సంతకం చేయనున్నారు. ఆ స్కీమ్‌లతో ప్రజలకు చేకూరే లాభం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వంటివన్నింటినీ వివరించనున్నారు.

ఎలాంటి పొలిటికల్ విమర్శలు లేకుండానే రేవంత్ తన స్పీచ్‌ను ముగించాలని ప్లాన్ చేశారు. సీఎం హోదాలో కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన పార్టీ నేతలు, అనుబంధ సంఘాలు, స్టేట్ నుంచి క్షేత్రస్థాయి లీడర్లకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఆ తర్వాత అతిథులుగా విచ్చేసిన లీడర్లకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌కు

సీఎం పదవి స్వీకరణ తర్వాత రేవంత్ రెడ్డి నేరుగా సెక్రటేరియట్‌కు వెళ్లనున్నారు. ఇతర రాష్ట్రాల ప్రముఖులు కూడా తెలంగాణ సచివాలయంలో అడుగు పెట్టనున్నారు. రేవంత్ తన చాంబరు‌లో బాధ్యతలు స్వీకరణ తర్వాత గతంలో హామీ ఇచ్చినట్లే దివ్యాంగురాలు రజిని‌కి సర్కార్ కొలువు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు మీద రేవంత్ రెడ్డి సంతకాలు చేయనున్నారు. గతంలో గాంధీభవన్‌లో స్వయంగా రేవంత్ ఇచ్చిన హామీని నెరవేర్చనున్నారు.

ఢిల్లీలో హడావుడి

తెలంగాణ సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన తర్వాత తొలిసారి మంగళవారం ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. గురువారం ఢిల్లీలో బిజీబీజీగా గడిపారు. ఏఐసీసీ ముఖ్యనేతలతో వరుసగా సమావేశం అవుతూ సీఎంగా తనకు అవకాశం కల్పించినందుకు ధన్యావాదాలు తెలిపారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఇక సీఎం ప్రమాణ స్వీకరణ తర్వాత రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నారు.

ఏర్పాట్ల పరిశీలన

సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారణ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి, ఇన్‌చార్జ్ డీజీపీ రవి గుప్తా, ఇతర ఉన్నతాధికారులు గురువారం ఉదయం ఎల్బీ స్డేడియాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై పర్యవేక్షించారు. సెక్యూరిటీ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీసులు, జీఏడీ అధికారులతో పాటు పార్టీ నేతలతో ఉన్నతాధికారులు ప్రత్యేక మీటింగ్‌ను సైతం నిర్వహించారు. జాతీయ స్థాయి నేతలు, ఇతర రాష్ట్రాల డెలిగేట్స్ రాబోతున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

సచివాలయ ఉద్యోగుల్లో సంబురాలు

సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందే సచివాలయ ఉద్యోగుల్లో సంబురాలు మొదలయ్యాయి. ఫస్ట్ టైమ్ రోడ్డు మీదకు వచ్చి సంతోషాన్ని పరస్పరం పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగినప్పుడు గద్దర్ పాడిన పొడుస్తున్న పొద్దు మీద.. అనే పాట పెట్టుకుని డ్యాన్సులు చేశారు. మరికొద్దిసేపు బతుకమ్మ ఆడారు. సొంత రాష్ట్రం ఏర్పడితే పరాయి రాష్ట్రంలోని వివక్షకు స్వస్తి చెప్పవచ్చని భావించి ఉద్యమంలోకి దూకామని, కానీ సొంత రాష్ట్ర పాలనలో మాత్రం పారదర్శకత, స్వేచ్ఛ లేకుండా తొమ్మిదేండ్లు పైకి చెప్పుకోలేని బాధలను అనుభవించామని ఉద్యోగులు వాపోయారు. 

కనీసం ఫోన్ మాట్లాడడానికి కూడా భయపడేవారమని, ఇప్పుడైనా ఇలాంటి భయానక వాతావరణం లేకుండా ప్రజలు కోరుకున్న పాలన వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పనివేళల్లో ఆఫీసుల్లో ఉండాల్సిన ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి వారి మనసులోని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాహుల్, రేవంత్ చెప్పినట్టుగా ప్రజా పాలన వస్తే అంత కన్నా సంతోషం ఏముంటుందని చెప్పుకొచ్చారు.

నేడు ఉదయం సోనియా, ప్రియాంక, రాహుల్ రాక

ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ గురువారం ఉదయం ఓకే ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు రానున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ ముఖ్యనేతలతో కొద్ది సేపు సమీక్షించనున్నారు. పార్టీ పవర్‌లోకి వచ్చిన తర్వాత తాజా పరిస్థితులపై ఆరా తీయనున్నారు.


Similar News