ఆయనే తెలంగాణ నూతన సీఎం.. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్న AICC..!
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైపోయింది. ఏఐసీసీ అధిష్టానం సైతం ఇదే నిర్ణయంతో ఉన్నది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో దాదాపు 50 మంది
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైపోయింది. ఏఐసీసీ అధిష్టానం సైతం ఇదే నిర్ణయంతో ఉన్నది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో దాదాపు 50 మంది ఆయనకే మొగ్గు చూపుతున్నారు. వారి అభిప్రాయాలనూ హైకమాండ్ పరిశీలించింది. ఇక లాంఛనంగా ప్రకటించడమే తరువాయి. ఇప్పటికే ఆ దిశగా రేవంత్‌కు సంకేతాలు కూడా అందాయి. కానీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తదితరులతో పార్టీకి, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీకి పిలిపించుకున్నారు. మరికొన్ని గంటల్లో అధికారికంగా ఏఐసీసీ నుంచి ప్రకటన వెలువడనున్నది.
బుజ్జగించేందుకే ఢిల్లీకి పిలుపు
ముఖ్యమంత్రి రేసులో ఉత్తమ్ ఉన్నట్లు వార్తలు రావడంతో పాటు డీకే శివకుమార్‌తో జరిగిన సంభాషణల అనంతరం ఆయనను కన్విన్స్ చేయడానికే ఖర్గే ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో జరిగిన చర్చల అనంతరం ఆయన కన్విన్స్ కావడంతో ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం విషయంలో మల్లు భట్టి విక్రమార్క సైతం కొన్ని షరతులు విధించడంతో దానిపై కూడా ఆయనను కన్విన్స్ చేయడం కోసం ఇద్దరినీ ఆయన ఢిల్లీ పిలిపించారు. ‘ఇండియా’ కూటమి సమావేశాలతో పాటు పార్లమెంటు సెషన్ కూడా జరుగుతున్నందున ఆ పనుల్లో బిజీగా ఉన్న ఖర్గే లంచ్ టైమ్‌లో తెలంగాణ వ్యవహారంపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో కలిసి 10 రాజాజీ మార్గ్‌కి చేరుకున్నారు. కాసేపట్లోనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలో కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఎల్లుండి ప్రమాణ స్వీకారం
మరికొన్ని గంటల్లోనే ఈ ప్రతిష్టంభన తొలగిపోతుందని స్వయంగా ఖర్గే మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పేర్లను వెల్లడించనున్నట్లు తెలిపారు. మరోవైపు పూర్తి స్థాయిలో మంత్రివర్గం కూడా 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఏఐసీసీ పెద్దలు మాత్రం తొలుత సీఎం, డిప్యూటీ సీఎం వ్యవహారాన్ని తేల్చేస్తామని, ఆ తర్వాత మంత్రివర్గం మీద దృష్టి పెడతామన్నారు. ఉత్తమ్ కోరుకుంటున్న అంశాలు, భట్టి విక్రమార్క షరతులు.. వీటిపై ఏఐసీసీ నేతలు మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు.
ఇలాంటివి సహజమే..
ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇలాంటి భిన్నాభిప్రాయాలు, అలకలు, కోరికలు చాలా సహజమని, ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం కాదని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలకు జరిగాయని, ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం ఏర్పడిందా అని ప్రశ్నించారు. బీజేపీ గెలిచిన మూడు రాష్ట్రాల్లో సైతం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరో తెలియలేదని, ఆ పార్టీకీ దానికుండే కష్టాలు ఉంటాయని, ఇవి పరిష్కారం లేని సమస్యలు కావని, సంక్షోభం అంతకంటే కాదన్నారు.
Also Read..
ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి..!
ఢిల్లీలో కాంగ్రెస్ కీలక భేటీ.. మరి కాసేపట్లో తెలంగాణ CM పేరు ప్రకటన..!