సమయం వస్తే.. నీ అంతు చూస్తా ! KCRకు రేవంత్ రెడ్డి వార్నింగ్
రాజకీయ కుటుంబం నుంచి రాకపోయినా జీరో గ్రౌండ్ నుంచి రేవంత్‌రెడ్డి తన పొలిటికల్ జర్నీని మొదలుపెట్టారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాజకీయ కుటుంబం నుంచి రాకపోయినా జీరో గ్రౌండ్ నుంచి రేవంత్‌రెడ్డి తన పొలిటికల్ జర్నీని మొదలుపెట్టారు. లోకల్ టు స్టేట్ తరహాలో జెడ్పీటీసీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు సుమారు రెండున్నర దశాబ్దాల కృషి రేవంత్ సొంతం. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో నిందితుడిగా అరెస్టు అయినప్పుడు తీవ్ర ఆగ్రహంతో సంచలన కామెంట్లు చేశారు. ‘నా సమయం వచ్చినప్పుడు నీ అంతు చూస్తా..’ అని 2015 మే 15న అరెస్టు సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఆ తర్వాత 2018 డిసెంబరు 4న అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి పోలీసులు తీసుకెళ్లిన ఘటనను జీవితంలో మరువలేనని, ఆ పోలీసుల్ని మర్చిపోనని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగానూ..
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 2017లో కాంగ్రెస్‌లో చేరినప్పుడు సైతం ఆయన తన సన్నిహితులతో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని, బీఆర్ఎస్‌ను రాష్ట్రం చరిత్ర పుటల నుంచి తరిమేస్తానని వ్యాఖ్యానించారు. ఐదేండ్ల తర్వాత ఆ లక్ష్యాన్ని సాధించారు.
వారిని ఓడించాలని పిలుపు..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీని లేవకుండా కేసీఆర్ ఎమ్మెల్యేలను సంతలో పశువులుగా కొన్నట్లు డబ్బులతో లాగేసుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో ‘ఆ పన్నెండు మందిని అసెంబ్లీ గేటును తాకనివ్వను’ అని ఛాలెంజ్ చేయడమేగాక వారిని ఓడించాలంటూ ఆ నియోజకవర్గ ఓటర్లకు అప్పీల్ చేశారు. ముగ్గురు మినహా మిగిలిన తొమ్మిది మంది ఓడిపోయారు.
కేసీఆర్‌కు దీటుగా పంచ్ డైలాగులు
తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రజలను తనదైన శైలిలో ఆకట్టుకునే కేసీఆర్ తరహాలోనే రేవంత్ కూడా ప్రజల్ని ఆకర్షించడంలో, ప్రసంగించడంలో దిట్ట అనే గుర్తింపు పొందారు. మీడియా సమావేశాల మొదలు బహిరంగసభ వరకు ఏ వేదిక అయినా కేసీఆర్‌ను ఆయన భాషలోనే సెటైర్లు వేస్తూ విమర్శించడంలో రేవంత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. కేసీఆర్ తిట్లను ప్రజలు ఎలా ఆసక్తిగా ఎంజాయ్ చేస్తారో గ్రహించిన రేవంత్ కూడా అలాంటి భాషనే వాడుతూ పంచ్ డైలాగులతో ఆకర్షించేవారు. అదే ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.
కేసీఆర్‌ను ఢీకొట్టగలిగే నాయకుడు రేవంత్ మాత్రమే అని జనంలో ఎస్టాబ్లిష్ అయింది. తాజాగా ఎన్నికల ప్రచారాన్ని పరిశీలిస్తే.. ‘కేసీఆర్‌ను బొందపెట్టాలి.. మతి ఉండే మాట్లాడుతున్నడా.. మందేసి మాట్లాడుతున్నడా.. ఇలాంటి డైలాగుల్ని ప్రజలు ఎంజాయ్ చేశారు. చివరకు ప్రజల్లో కేసీఆర్ పట్ల ఉన్న అభిప్రాయాలను గ్రహించిన రేవంత్ అన్ని బహిరంగసభల్లో బై.. బై.. కేసీఆర్.. అనే స్లోగన్‌ను విస్తృతంగా పాపులర్ చేశారు. ఇది ఓట్ల రూపంలో రేవంత్ ఆశించిన లక్ష్యాన్ని సాధించింది.