కాంగ్రెస్ గెలిస్తే ఇంటికి 5 లక్షలు.. మణుగూరులో రేవంత్ కీలక హామీ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి చూపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
దిశ, మణుగూరు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి చూపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణాకు పట్టిన పీడ కేసీఆర్ను వదిలించుకునే సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా మణుగూరులో జరిగిన స్ట్రీట్ కార్నర్లో కేసీఆర్పై నిప్పులు చెరిగారు. పాదయాత్రలో ప్రజలు అనేక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వం అటవీ అధికారులచే పోడు భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. 9 సంవత్సరాలలో ఇవ్వలేనిది, 9 నెలల్లో పోడు పట్టాలు ఇస్తామని మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే ఇందిరమ్మ ఇండ్లకు రూ,5 లక్షలు ఇచ్చి తీరుతామన్నారు.వచ్చే ఎన్నికల్లో పదికి పది నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామన్నారు. బీఆర్ఎస్ దొరల పార్టీ అని. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ అని, కాంగ్రెస్ పేదల పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్యాస్ సిలెండర్ ను రూ,500 లకే అందిస్తామన్నారు.
ఎమ్మెల్యే రేగాపై సంచలన వ్యాఖ్యలు..
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంతారావును త్వరలోనే వంద మీటర్ల గోతిలోపెట్టేందుకు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. దందాలు చేస్తున్న కాంతారావు బేడీలు వేయించి గుడ్డలూడదీసి కొడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు బనాయిస్తే పోలీసులను కూడా వదిలేది లేదని, రాసుకొండని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి..ప్రజల సమస్యలను తీరుస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు చందా లింగయ్య, తాటి వెంకటేశ్వర్లు మహబూబాబాద్ నియోజకవర్గ ఇంచార్జి విజయరమణారావు, తదితరులు పాల్గొన్నారు.