నిండు సభలో కీలక హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి

మంచిర్యాలలో కాంగ్రెస్‌ పార్టీ ‘జై భారత్‌ సత్యాగ్రహ సభ’ను చేపట్టింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ సభకు తరలివచ్చారు.

Update: 2023-04-14 15:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాలలో కాంగ్రెస్‌ పార్టీ ‘జై భారత్‌ సత్యాగ్రహ సభ’ను చేపట్టింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ సభకు తరలివచ్చారు. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా కాంగ్రెస్‌ కీలక నేతలు హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో దళితులు ఓట్లు వేయరనే భయంతోనే ఇవాళ అంబేద్కర్ కాళ్లకు కేసీఆర్ నమస్కారం చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరును ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

ఇసుక మాఫియాకు అడ్డొచ్చారని దళిత యువకులను తొక్కించిన సంగతి మర్చిపోయావా? అని మండిపడ్డారు. అలాగే.. ఖమ్మం జిల్లాలో గిరిజనులకు బేడీలు వేయించిన సంగతీ మర్చిపోయావా? ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం దళితులకు న్యాయం చేయకపోగా.. అన్యాయమే ఎక్కువ జరుగుతోందని అన్నారు. కేటీఆర్, కవితపై అవినీతి ఆరోపణలు వస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. అంతేగాక, కాంగ్రెస్‌లో గుర్తింపు తెచ్చుకొని కొందరు నేతలు వెళ్లిపోయారని.. ఎండిపోయిన ఆకులు కొన్ని రాలినా భయం లేదని, కొత్తవి చిగురిస్తాయని ఏలేటిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతేగాక, సింగరేణి ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని ప్రకటించారు.

Tags:    

Similar News